Sarfaraz Khan | విధాత: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. జాతీయ జట్టు ఎంపికలో తనకు ప్రతికూలమవుతున్న భారీ శరీరాకృతిని కరిగించుకునే పనిలో అతను పూర్తిగా తన పాత రూపాన్ని కోల్పోయాడు. గతంలో భారీ కాయుడైన సర్ఫరాజ్ ఖాన్ ను చూసిన వారు ఇప్పుడు అతడిని చూస్తే గుర్తు పట్టడం కూడా కష్టమన్నంతగా మారిపోయాడు. గతంలో అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలతో తరచుగా ట్రోలింగ్‌కు గురైన సర్ఫరాజ్, ఇప్పుడు ఏకంగా 17కిలోలకు పైగా గణనీయంగా బరువు తగ్గి, స్లిమ్‌గా తయారయ్యాడు. 27ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ కఠినమైన డైట్, వ్యాయామ ప్రణాళికతో రెండు నెలల్లోనే తన శరీరంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చాడు. ఈ మార్పు అతని ఫిట్‌నెస్‌ను గణనీయంగా మెరుగుపరిచి, భవిష్యత్తులో టీమిండియాలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకునే దిశగా మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తన శరీర మార్పుతో సెలెక్టర్లకు సంకేతం పంపాడు.
ఇటీవలే సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం వారు తమ కుటుంబం మొత్తంతో కలిసి అతను బరువు తగ్గడంపై కసరత్తు చేశామని చెప్పాడు. గోదుమలు, బియ్యంతో చేసిన ఆహారాన్ని మానేసి..ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ లో అనుసరించాడు. ఇష్టమైన చికెన్, మటన్ బిర్యానీని ఈ రెండు నెలల కాలంలో పూర్తిగా వదులుకున్నాడు. రోజుకు ఒక గంట పాటు వారానికి ఆరు రోజులు జిమ్ చేసి, ఆ తర్వాత రన్నింగ్, స్విమ్మింగ్ కూడా చేయడం ద్వారా మొత్తానికి అనుకున్నది సాధించాడని తండ్రి తెలిపారు.