IND vs NZ: 4th T20I | దూబే మెరుపు అర్ధశతకం వృథా… న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు ఓటమి

విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దూబే మెరుపు అర్ధశతకం వృథాగా మారింది. సైఫర్ట్ దూకుడు, సాంట్నర్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్‌లో కివీస్‌కు 3-1 ఆధిక్యం లభించింది.

India vs New Zealand 4th T20I match as Dube fifty goes in vain in Visakhapatnam

Dube’s Fifty Goes in Vain as New Zealand Beat India by 50 Runs in 4th T20I

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

IND vs NZ: 4th T20I | విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. శివమ్ దూబే వేగంగా అర్ధశతకం సాధించినా… జట్టు మొత్తంగా విఫలమవడంతో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. టిమ్ సైఫర్ట్ దూకుడు, మిచెల్ సాంట్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ ఈ మ్యాచ్​ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో సిరీస్‌ సమీకరణం 3-1 గా మారింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ సైఫర్ట్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. కాన్వే సహకారంతో తొలి ఓవర్లలోనే భారీ స్కోరుకు పునాది వేశాడు. మధ్య ఓవర్లలో కొన్ని వికెట్లు పడినా… చివరి దశలో డారెల్​ మిచెల్ దూకుడుగా ఆడి  స్కోరును మరింత పెంచాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 7 వికెట్లకు 215 పరుగులు చేసింది.

 సైఫర్ట్ దూకుడుకివీస్ భారీ స్కోరు

కివీస్ ఇన్నింగ్స్ మూడు దశల్లో సాగింది. తొలి ఎనిమిది ఓవర్లలో వేగంగా పరుగులు సాధించారు. ఆ తర్వాత భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వికెట్లు పడిపోయాయి. కానీ చివరి ఓవర్లలో భారత బౌలర్లు పట్టువిడువడంతో బ్యాటర్లు మళ్లీ దూకుడు పెంచి స్కోరును 200 దాటించారు.

భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసినా, భారీగా పరుగులు సమర్పించుకుని, రన్‌రేట్‌ను అదుపులోకి తేవడంలో విఫలమయ్యారు.

దూబే పోరాటం వృథాసాంట్నర్ మ్యాజిక్

216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తడబడింది. అభిషేక్ శర్మ తొలి బంతికే అవుటయ్యాడు. ఇక వెంటవెంటనే వికెట్లు పారేసుకుని టాప్ ఆర్డర్ విఫలమవడంతో స్కోరు నెమ్మదిగా సాగింది. 11 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయిన  భారత్ 87 పరుగులే చేసి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఈ దశలో శివమ్ దూబే ఎదురుదాడికి దిగాడు. ఇష్ సోధీ ఓవర్‌లో 29 పరుగులు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. కేవలం 15 బంతుల్లో అర్ధశతకం సాధించిన దూబే, మొత్తం 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ రన్‌ఔట్ కావడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి.  వెనువెంటనే వికెట్లు వరుసగా పడిపోయాయి. చివరకు భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది.

న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 3 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. డఫీ, సోధీ చెరో రెండు వికెట్లు తీశారు.

Latest News