Indian Women’s Cricket Team | ఉమెన్స్ క్రికెటర్లకు సొంత రాష్ట్రాల్లో బ్రహ్మరథం

ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా మహిళా క్రికెటర్లకు సొంత రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. బెంగాల్‌లో రీచా ఘోష్‌కు భారీ ర్యాలీతో స్వాగతం పలకగా, మహారాష్ట్ర ప్రభుత్వం స్మృతి మందనా, జెమిమా, రాధాలకు రూ.2.25 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది.

విధాత : ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన టీమిండియా మహిళా క్రికెటర్లకు సొంత రాష్ట్రాల్లో అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విమానాశ్రయాల నుండి తమ ఇళ్లకు వెళ్లే వరకు మహిళా క్రికెటర్లకు భారీ ర్యాలీలు, స్వాగతాలతో జననీరాజనం పలుకుతున్నారు. శుక్రవారం సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్లోని స్వగ్రామం సిలిగురికి వెళ్లిన టీమిండియా క్రికెటర్ రీచా ఘోష్ కు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో కూర్చోబెట్టుకొని వేలాదిమంది ప్రజలు భారీ ర్యాలీ మధ్య ఆమెను ఇంటికి చేర్చారు. తన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేని రిచా ఘోష్ చెప్పుకొచ్చారు.

ఇదే రోజు మహారాష్ట్ర ఉమెన్స్ క్రికెటర్లు స్మృతి మందనా, జెమిమా రోడ్రిగ్స్, రాధలకు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘనంగా సన్మానించారు. రూ.2.25కోట్ల చెక్కులను వారికి ప్రోత్సాహకంగా అందించారు.

ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ క్రికెటర్ల శ్రీచరణి, అరుంధతి రెడ్డిలకు అభిమానులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీచరణికి ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ప్రకటించారు. ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు చెందిన టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతాలు పలుకుతూ, ప్రోత్సాహకాలు అందిస్తుండటం విశేషం.