Site icon vidhaatha

Bride Calls off Wedding | ఆ టైమ్‌లో వణికిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు.. బీహార్‌లో వింత ఘటన

Bride Calls off Wedding | ఒక్కోసారి పెళ్లిళ్లలో కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. భర్త వేరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వార్త తెలిసి భార్యలు అడ్డగించిన సందర్భాలు విన్నాం. పెళ్లి సమయానికి ప్రియుడితోనో, ప్రియురాలితోనో చెక్కేసిన ఘటనలూ చూశాం. ఇలాంటిదే కానీ.. ఇంత కంటే విచిత్రమైన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. కీలక సందర్భంలో పెళ్లికి వధువు నిరాకరించింది. ఈ గొడవ ఆఖరుకు పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది.

బీహార్‌లోని కైమూర్‌ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. పెళ్లి కోసం పెళ్లికొడుకు ఊరేగింపుగా పెళ్లికుమార్తె ఇంటికి వచ్చాడు. పెళ్లిలో చాలా వరకూ క్రతువులన్నీ పూర్తయ్యాయి. ఒకవైపు వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి. డీజే సౌండ్లతో పాటలు మారుమోగిపోతున్నాయి. అంతా సవ్యంగా సాగిపోతున్నాయి. అంతకు ముందు వరుడికి పెళ్లివారు ఘనంగా స్వాగతం పలికారు. సిందూరం దిద్దడానికి ముందు నిర్వహించే కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కీలక ఘట్టమైన సిందూరం దిద్దే సందర్భం వచ్చింది. అప్పటిదాకా హుషారుగానే ఉన్న కుర్రాడు.. ఏమైందో గానీ.. పెళ్లికూతురు నుదుటన సిందూరం దిద్దే సమయంలో చేయి వణికింది. దీన్ని గమనించిన పెళ్లికూతురు ఏమనుకుందో ఏమోగానీ.. అతగాడిని పెళ్లి చేసుకునేదిలేదని మొరాయించింది. బంధువులు, ఇతరులు ఎంత నచ్చజెప్పాలని చూసినా ఆమె మాత్రం భీష్మించుకుని కూర్చుంది. అతడు పిచ్చోడని, తాను అతడిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చేసింది.

ఈ ఘటనపై వరుడు మాట్లాడుతూ.. పెళ్లిలో సిందూరం దిద్దే సమయంలో తన చేయి వణికిందని, దాంతో తనను పిచ్చోడని దూషిస్తూ వధువు తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించిందని చెప్పాడు.
ఈ ఘటన భభువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లి మండపానికి వచ్చారు. రెండు కుటుంబాలు స్టేషన్‌కు రావాలని కోరారు. అక్కడ సుదీర్ఘ చర్చలు జరిగినా.. ఒప్పందం మాత్రం కుదరలేదు. దీంతో.. వరుడు చేసేదేమీ లేక.. ఒంటరిగానే తన ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.

పెళ్లి రద్దు కావడంతో వధువు కుటుంబం.. తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేయాలని పట్టుబట్టారు. అయితే.. తాము లక్ష రూపాయలు కట్నం మాట్లాడుకుంటే.. 90వేలు ముందు ఇచ్చారని వరుడి తండ్రి చెప్పాడు. అందులో నగల కోసం 30వేలు, చీరెల కోసం 20వేలు ఖర్చు చేశామని, పెళ్లికి ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్‌కు 10వేలు ఖర్చయ్యాయని తెలిపారు. ఇచ్చిన డబ్బంతా అయిపోయిందని చేతులెత్తేశాడు. పెళ్లిలో అన్ని కార్యక్రమాలూ అయిపోయాయని, సిందూరం పెట్టే సమయంలో పెళ్లికొడుకు అక్కడ సౌండ్లతో కంగారుపడి లేదా ఒత్తిడికి గురై చేయి వణికిందని వరుడి బంధువు ఒకరు అన్నారు. ఆ మాత్రం దానికే వధువు అతడిని పిచ్చోడని అంటూ పెళ్లికి నిరాకరించిందని వాపోయాడు. ఈ విషయాన్ని సెటిల్‌ చేసేందుకు తాము ప్రయత్నించినా, ఆ అమ్మాయి వినడం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

Earn more money: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఈ ఐదు చిట్కాలు పాటించండి..
OTT Viewers: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండుగే..21సినిమాలు విడుదల
Asteroids | శుక్రుడి సమీపాన దాగిన భారీ ఆస్టరాయిడ్స్‌.. హెచ్చరికలు లేకుండా భూమిని ఢీకొనే ముప్పు!
Eco Friendly Plastic | ప్లాస్టిక్ పీడకు తిరుగులేని విరుగుడు కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు

Exit mobile version