Shocked Groom | నాకే ఎందుకిలా? అని కొన్ని కొన్ని సార్లు కొంతమంది వెరైటీ సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫాఫం.. ఈ వరుడి పరిస్థితి కూడా అలానే తయారైంది. బ్యాండ్ బాజాలు మోగించుకుంటూ.. బారాత్‌తో బయల్దేరిన వరుడికి వధువు, ఆమె ఫ్యామిలీ షాక్ ఇచ్చారు. దీంతో అప్పటిదాకా మాంఛి ఊపూఉత్సాహంతో వచ్చిన వరుడు కాస్తా నీరుగారిపోయాడు. ఈ విచిత్ర ఘటన అమృత్‌సర్‌లో చోటు చేసుకున్నది.
అందరు పెళ్లికొడుకుల్లానే ఇతగాడు కూడా భారీ ఊరేగింపుతో పెళ్లి మంటపానికి చేరుకున్నాడు. వధువు కుటుంబం చెప్పినట్టుగా మోగాలో ఐదో నంబర్ గల్లీలోకి ఉదయం 11 గంటల సమయంలో మగపెళ్లివారంతా వచ్చారు. కానీ.. అక్కడ ఎలాంటి చప్పుడు లేదు.. ఎలాంటి అలంకరణలూ లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది. పెళ్లికూతురికి, వారి బంధువులకు ఫోన్ చేస్తే.. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేరు’ అంటూ ఒక తీయటి స్వరం ఫోన్‌లో వినిపించింది. ఆ ప్రాంతంలో వాకబు చేస్తే అలాంటి యువతి ఎవరూ ఇక్కడ లేరని సమాధానం వచ్చింది. షాకైన వరుడు, ఆయన బంధుగణం.. ఆ యువతి ఫొటో పట్టుకుని అన్ని గల్లీలు తిరిగారు. గంటల తరబడి వెతికినా.. ఆ యువతి జాడ తెలియరాలేదు.
ఏదో మోసం జరిగిందని అనుమానించిన వరుడు కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ పెళ్లి సంబంధాన్ని వరుడి వదిన తీసుకువచ్చినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.. వీడియో చాట్ చేశారు. ఏ ఫ్యూ మంత్స్ లేటర్.. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఎక్కడ పెళ్లి జరగాలో కూడా నిశ్చయించుకున్నారు. కానీ.. వరుడు ఊరేగింపుగా వెళ్లేసరికి అక్కడ ఇల్లూ లేదు.. మండలం లేదు.. పెళ్లీ కాలేదు!