ఈ చైనా చిరుత ‘భీమున్ని’ చూసారా.?

చైనాలో  ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక జూ ఉన్నపళంగా వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఆ జంతు ప్రదర్శన శాలను సందర్శించడానికి ఎక్కడెక్కన్నుంచో సందర్శకులు గుంపులుగుంపుగా వస్తున్నారు. కారణం, ఓ చిరుతపులి.

  • Publish Date - June 26, 2024 / 11:35 PM IST

నైరుతి చైనాలోని సిచువాన్​ ప్రావిన్స్​లో పాంజిహువా(Panzhihua Zoo) జంతు ప్రదర్శన శాల రాత్రికి రాత్రే చాలా ఫేమస్​ అయిపోయింది. కారణం, ఒక చిరుత. దాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇదేంటి? ఒక చిరుతను చూడటానికి ఇంత మందా? దాని ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా.. అదే మరి. మామూలుగా మన దృష్టిలో చిరుతపులి ఎలా ఉంటుంది? సన్నగా, నాజూగ్గా, వాయువేగంతో పరుగెత్తి వేటాడే చిరుత గుర్తుకువస్తుంది. దీన్ని చూస్తే ఒక్కసారిగా షాక్​కు గురవుతారు. ఎందుకంటారా? ఇది చిరుత ‘భీముడు’(Overweight Leopard). ఈ చిరుత చాలా లావుగా ఉంది. చిన్నపాటి ఏనుగులా కనబడుతోంది. విపరీతమైన ఊబకాయంతో అది చూపరులను ఆకర్షిస్తోంది. దీంతో ఆ జూ టికెట్ల కలెక్షన్​ విపరీతంగా పెరిగి ఏకంగా 26వేల డాలర్లకు చేరుకుంది.  నిజానికి అది చాలా చిన్న జూ.

గత మార్చిలో ‘చైనా ఆఫీసర్ క్లాహాసర్​ (China’s Officer ClawHauser) పేరుతో నెట్​లో విడుదలైన విడియో అమాంతం పాంజిహువా జూను పెద్ద ‘తప్పకుండా చూడాల్సిన ప్రదేశం’గా మార్చేసింది. ఆఫీసర్​ క్లాహాసర్ అనేది డిస్నీ వారి కామిక్​ సినిమా​ ‘జూటోపియా’(Zootopia) లో  ఓ బోండాం చిరుతపులి పాత్ర. ఇప్పుడంతా ఈ చిరుతను అదే పేరుతో పిలుస్తున్నారు. ఆ చిరుతపులి వయసు దాదాపు 16 ఏళ్లు. అంటే మనిషి వయసుతో లెక్కించాలంటే ఓ 60, 70 ఏళ్లన్నమాట. 2010 నుండి ఈ చిరుత ఇదే జూలో ఉంటోంది. 2017 వరకు కూడా ఇది మామూలుగానే ఉంది. ఆ తర్వాతే లావెక్కడం మొదలుపెట్టింది. జూలో స్వేచ్ఛగా సంచరించడానికి తగినంత ప్రదేశం లేకపోవడం వల్ల తిరగడం తక్కువయింది. అంతే కాకుండా వయసు కూడా ఈ రకంగా బరువు పెరగడానికి ఒక కారణమంటున్నారు జూ అధికారులు. సాధారణంగా చిరుతలు గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో పరిగెత్తుతాయి. ఇది మాత్రం నింపాదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రాజాలా తన ఆహారం దగ్గరికి వస్తుంది.

ఈ భీముడి బరువు తగ్గించడానికి( Weight Loss programme)  జూ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేసారు. ఓ రెండు నెలల పాటు ఆహారం తగ్గించారు. బరువు తగ్గించే మందులు వాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అది మాత్రం పుష్పలా ‘తగ్గేదే లే’ అంటూ అలాగే పిడిరాయిలా కూర్చుంది. అయితే దాని వయసు రీత్యా ఆహారం ఇవ్వకుండా బాధపెట్టడం కరెక్ట్​ కాదని ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన విజ్ఞప్తుల మేరకు  జూ అధికారులు ఈ బరువు తగ్గించే ప్రోగ్రాంను వదిలేసారు. ఇంతా చేసి దానికి ఎలాంటి ఆనారోగ్యం లేదు. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత భీముడు గారు భలే భేషుగ్గా ఉందని డాక్టర్లు తేల్చేసారు. Zoo in China halts weight-loss plan for famous overweight leopard

ఈ జంతువుల లావు అనేది చైనావ్యాప్తంగా ఉందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా జూలలోని చాలా రకాల జంతువులు లావెక్కడం తాము గమనించామని వారు చెబుతున్నారు. ఏదేమైనా ఈ భీమ చిరుత ఇలా వార్తల్లోకి ఎక్కడం మాత్రం విచిత్రంగానే ఉంది.