Proposal at Waterfall | వీళ్లు మారరు బ్రో! జలపాతం వద్ద ప్రపోజ్‌ చేయబోయాడు.. కాలు జారి..

ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఇంత అతి అవసరమా? అని ఒక యూజర్‌ ప్రశ్నించారు. పోనీలే ఆ పిల్లకు కనీసం ఇన్సూరెన్స్‌ డబ్బులైనా వస్తాయేమో అని ఒకరు రాశారు. ఆ పిల్లను ఆ కుర్రాడు పెళ్లి చేసుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా! లక్కీబాయ్‌.. అని మరొకరు సరదగా వ్యాఖ్యానించారు. అయితే..

  • Publish Date - July 9, 2025 / 07:11 PM IST

Proposal at Waterfall | సాధారణంగా ప్రేమికుడు తన ప్రేయసి ముందు మోకాళ్లపై కూర్చొని ఓ ఉంగరం డబ్బా తెరిచి.. ప్రపోజ్‌ చేస్తాడు! ఆమె.. వావ్‌ అంటూ.. రెండు చేతులూ బుగ్గలకు ఆనించుకుని.. ఆ ప్రపోజల్‌ను స్వీకరిస్తూ ఉంటుంది. ఈ ప్రతిపాదన ఎంత రొమాంటింగ్‌ ఉంటే.. అంత కిక్‌ ఉంటుందని, ఆ జ్ఞాపకాలను జీవితాంతం పదిలంగా దాచుకోవచ్చని కోరుకుంటూ ఉంటారు. అందుకు విభిన్న, వినూత్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అతి తెలివికి పోయాడు. ఏకంగా జలపాతం పైకి తీసుకెళ్లి  ప్రపోజ్‌ చేయబోయాడు. అదికూడా పల్లపు ప్రాంతంలో పాకుడు పట్టిన బండరాళ్లపై నిలబడి! ఇక నోట్లోంచి విల్‌ యూ మ్యారీ మీ?.. అన్న పదాలు రావడమే ఆలస్యం. అదే సమయంలో విధి మరోలా తలచింది. అంతే.. అతగాడు కాస్తా జారిపడి.. జలపాతంలో కొట్టుకుపోయాడు. ఒక అందమైన రొమాంటిక్‌ ఫీలింగ్‌ కాస్తా.. విషాదాంతం కావడంతో ఆ యువతి నిశ్చేష్టురాలైంది. వాళ్ల పేర్లు తెలియలేదుకానీ.. జమైకాలోని ఓచో రియోస్‌లోని డన్స్ నది జలపాతం వద్ద ఈ  ఘటన చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జలపాతాల వద్ద తగిన రక్షణ ఏర్పాటు లేకపోవడంతోపాటు.. ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లకు పాల్పడే వారిని నిరోధించడం తదితర అంశాలపై నెటిజన్లలో పెద్ద చర్చే నడిచింది.

ఆ వీడియోలో ఎవరన్నదీ తెలియరాలేదు. అయితే.. వీడియో ప్రారంభంలో ఇద్దరు యువతీ యువకులు జలపాతం అగ్రభాగానికి చేరుకోవడం కనిపిస్తుంది. అతడు ఆమె వైపు తిరిగి, వెడ్డింగ్‌ రింగ్‌ను తన జేబులోంచి తీసి, మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్‌ చేయబోతుంటే.. ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. అయితే.. ఆలోపే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడు మోకాళ్లపై కూర్చొనే క్రమంలో కాలు స్లిప్‌ అయి… బండలపై కొట్టకుపోవడం కనిపిస్తుంది.  ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ఇంత అతి అవసరమా? అని ఒక యూజర్‌ ప్రశ్నించారు. పోనీలే ఆ పిల్లకు కనీసం ఇన్సూరెన్స్‌ డబ్బులైనా వస్తాయేమో అని ఒకరు రాశారు. ఆ పిల్లను ఆ కుర్రాడు పెళ్లి చేసుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా! లక్కీబాయ్‌.. అని మరొకరు సరదగా వ్యాఖ్యానించారు. అయితే.. నీటి మడుగులో పడిపోయిన ఆ యువకుడిని తర్వాత కొందరు రక్షించారట.