Viral Video | ఏయ్​ బయటకు వెళ్లొద్దని చెప్పానా? లేదా? అమ్మంటే.. అంతే..! ఇంటర్​నెట్​ షేక్​

  • Publish Date - July 5, 2025 / 10:15 PM IST

Viral Video | ఓ బుజ్జి పప్పీ ఇంటి నుంచి బయటకు పరుగు పెట్టింది… వెంటనే తల్లి పరుగెత్తింది… కానీ, అంతలోనే సోదరసోదరీమణులందరూ వెనకే వెళ్లారు. దాన్ని తీసుకుని మిగతా పిల్లలను వెంటేసుకుని ఆ అమ్మ మళ్లీ ఇంట్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్‌ని కదిలిస్తున్న ఓ వీడియో ఇప్పుడు నలుగురిని నవ్విస్తూ కళ్లల్లో తడి తెప్పిస్తోంది. ఒక్క పప్పీ బయటికి దూసుకెళ్తే, వెంటనే దాని లాబ్రడార్ తల్లి పరుగెత్తింది. కానీ అంతలోనే మిగతా ఎనిమిది పిల్లలు కూడా వెనకాలే పరుగెత్తాయి. ఈ సంఘటన మొత్తం ఓ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో(CCTV footage) రికార్డు అయింది.

ఈ వీడియోలో ఒక తెల్ల లాబ్రడార్(Labrador) తల్లి, బయటకు దూసుకెళ్లిన నల్లపిల్ల పప్పీని వెంబడిస్తూ కనిపిస్తుంది. ఆ పప్పీకి వాహనాల గురించి తెలియదు. రోడ్డు మీద ఉంటే ప్రమాదలంటే అసలే తెలియదు. మొరగడం కూడా రాని వయస్సు. కానీ ఆ తల్లి ఆందోళన మాత్రం మనుషుల్లో కూడా కొందరిలో ఉండదు. ముందు వెళ్లిన పప్పీని తీసుకొచ్చేందుకు తల్లి పరుగెత్తగా, అంతలోనే మిగతా ఎనిమిదిమంది పిల్లలు కూడా తోబుట్టువు మార్గాన్ని అనుసరించి బయటకి వచ్చాయి. ఆ క్షణంలో తల్లి కంగారు ఊహించలేనిదేమీ కాదు. ఒక్కసారి రోడ్డు మీదికి పడ్డాక వాహనమొకటి దూరంగా కనిపించడంతో తల్లి మెల్లగా మిగిలిన ఎనిమిది పప్పీలను ఇంట్లోకి నెట్టడం మొదలుపెట్టింది. ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా లోపలికి పంపించి, చివరికి మొదట బయటకు వెళ్లిన పప్పీని కూడా పట్టుకుని తీసుకొచ్చింది. అన్ని పిల్లలూ క్షేమంగా ఇంట్లోకి రావడం చూసిన తర్వాతే తల్లి నిశ్చింతగా ఉందనుకోండి.

ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. ఇప్పటివరకు 2.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలతో పాటు ఓ ఆసక్తికరమైన ప్రశ్నను కూడా అడుగుతున్నారు – “ఏమబ్బా, నాన్న ఎక్కడ?” “ఏంటీ? Single mom? ఒక్క తల్లే తొమ్మిదింటినీ చూసుకుంటుందా?” అంటూ సరదాగా స్పందించారు. అయినా, వీటన్నిటికీ మించి ఈ తల్లి చూపించిన స్పందన, బాధ్యత, నమ్మకం, ధైర్యం – ఇవన్నీ కలిపి ఒక పరిపూర్ణ మాతృమూర్తిని తలపించేలా ఉన్నాయి. ఆ వీడియో కేవలం ఒక పప్పీల పరుగు కాదు. అది ఒక తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అటువంటి మమకారానికి మెచ్చుకోకుండా ఉండలేము. నాన్న ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానం లేకపోయినా, ఈ తల్లి మాత్రం అసలైన హీరోయిన్​…కాదు హీరో.

ఇదిగోండి… ఆ వీడియో..!