Site icon vidhaatha

Gmail Security Alert | జీమెయిల్‌ వినియోగదారులకు గూగుల్‌ హ్యాకింగ్​ హెచ్చరిక?– నిజం ఏమిటి?

ShinyHunters Phishing Attack Targets Gmail Worldwide

Gmail Security Alert | ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల జీమెయిల్‌ యూజర్లు ఉన్నారు. ఈ సంఖ్యే గూగుల్‌ మెయిల్‌ సేవ ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తుంది. అయితే తాజాగా మీడియా రిపోర్ట్స్‌లో ఒక వార్త హడలెత్తించింది. గూగుల్‌ నేరుగా యూజర్లందరికీ భారీ భద్రతా హెచ్చరిక పంపిందని, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించిందని ప్రచారం జరిగింది. అంతర్జాతీయంగా “Salesforce Hack” అనే పదం చర్చనీయాంశమైంది. ఈ హ్యాక్‌ వెనుక ShinyHunters అనే సైబర్‌ క్రిమినల్‌ గ్రూప్‌ ఉన్నట్టు నివేదికలు బయటపడ్డాయి.

ఈ ఘటనలో అసలు ఏం జరిగింది?

హ్యాకర్లు మొదటగా సేల్స్​ఫోర్స్​  సిస్టమ్‌పై దాడి చేశారు. గూగుల్‌ ఉద్యోగులను IT Help Desk సిబ్బందిలా నటించి మోసం చేశారు. ఒక ఉద్యోగి నుంచి యాక్సెస్‌ పొందగానే సేల్స్​ఫోర్స్​ డేటాబేస్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి వ్యాపార సంబంధిత వివరాలు, కస్టమర్‌ డేటా, ఈమెయిల్‌ అడ్రసులు లాంటి Business Contact Information దొంగిలించారు. ఇది వ్యక్తిగత డేటా కాకపోయినా, ఇలాంటి సమాచారం హ్యాకర్ల చేతిలో పడ్డాక చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీన్ని వాడి ఫిషింగ్‌ మెయిల్స్‌, విషింగ్‌ కాల్స్‌ మరింత నిజమైనవిలా కనిపించేలా తయారు చేయగలరు.

ShinyHunters అనే గ్రూప్‌ కొత్తది కాదు. గతంలో AT&T, Microsoft, Tokopedia వంటి కంపెనీలపై కూడా వీరు దాడులు చేశారు. వీరి విధానం చాలా సింపుల్‌ – డేటాబేస్‌ దొంగిలించడం, తర్వాత డార్క్‌ వెబ్‌లో అమ్మడం లేదా Data Leak Sites (DLS) ద్వారా ఒత్తిడి తేవడం. ఇప్పుడు సేల్స్​ఫోర్స్​ డేటా వాడి Gmail యూజర్లను టార్గెట్‌ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యూజర్లకు నిజమైనవాటిలాగే కనిపించే Google Alerts మెయిల్స్‌ పంపారు. ఆ లింక్‌లపై క్లిక్‌ చేస్తే నకిలీ లాగిన్‌ పేజీలు ఓపెన్‌ అవుతాయి. కొందరిని 2FA (Two Factor Authentication) కోడ్‌ చెప్పమని ఫోన్‌ చేసి మోసం చేశారు. దీనిని “Vishing” అంటారు. ఇలా Gmail లాగిన్‌ డిటైల్స్‌ మాత్రమే కాదు, 2FA కోడ్స్‌ కూడా హ్యాకర్ల చేతికి చేరే ప్రమాదం ఉంది.

ఈ పరిణామాల తరువాత మీడియా రిపోర్ట్స్‌లో “Google sent massive warning to 2.5 billion Gmail users” అంటూ కథనాలు వచ్చాయి. దీంతో యూజర్లలో మరింత ఆందోళన పెరిగింది. కానీ గూగుల్‌ మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ అధికారిక బ్లాగ్‌లో “ఈ రూమర్స్‌ అన్నీ తప్పు. మేము ప్రభావితమైన కొద్ది మందికే నోటిఫికేషన్‌ పంపాము. Gmail రక్షణ వ్యవస్థ రోజూ 99.9% ఫిషింగ్‌, మాల్వేర్‌ దాడులను అడ్డుకుంటాయి. కాబట్టి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ప్రకటించింది.

అయినా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేల్స్​ఫోర్స్​  డేటా వాడి హ్యాకర్లు మరింత నమ్మదగిన ఫిషింగ్‌ దాడులు చేస్తే సాధారణ యూజర్లు మోసపోవడం ఖాయం. కాబట్టి ప్రతి Gmail యూజర్‌ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా బలమైన, ప్రత్యేక పాస్‌వర్డ్‌ వాడాలి. ఎక్కడా అదే పాస్‌వర్డ్‌ను మళ్లీ వాడకూడదు. Two Factor Authentication తప్పనిసరిగా ఆన్‌ చేయాలి. SMS OTP కంటే Google Authenticator లేదా Hardware Security Keys సేఫ్‌. గూగుల్‌ తాజాగా ప్రవేశపెట్టిన Passkeys (Biometric లేదా Hardware ఆధారిత) వాడితే మరింత భద్రత ఉంటుంది. అలాగే Gmail Account Activity ని రెగ్యులర్‌గా చెక్‌ చేయాలి. Login Historyలో అనుమానాస్పదమైన యాక్సెస్‌ ఉంటే వెంటనే పాస్‌వర్డ్‌ మార్చాలి.

మొత్తానికి ఈ ఘటనలో Gmail యూజర్ల పాస్‌వర్డ్‌లు ప్రత్యక్షంగా లీక్‌ కాలేదు. కానీ సేల్స్​ఫోర్స్​  వ్యాపార సమాచారం లీక్‌ అవడం వల్ల హ్యాకర్లకు పెద్ద మొత్తంలో కాంటాక్ట్స్​ సమాచారం దొరికింది. ఇప్పుడు వారు పంపే ఫిషింగ్‌ మెయిల్స్‌ ఒరిజినల్​ జీమెయిల్​ లాగే  కనిపిస్తాయి. అందువల్ల యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. గూగుల్‌ తమ ప్రధాన సిస్టమ్స్‌ సురక్షితం అని చెప్పినా, వినియోగదారులు భద్రతాచర్యలు పాటించకపోతే దాడుల బారిన పడే అవకాశాలు ఎక్కువే.

Gmail భద్రతా చర్యల గురించి తెలుసుకోవాల్సిన ప్రశ్నలు – సమాధానాలు

ఈ ఘటనలో జీమెయిల్‌ లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ ప్రత్యక్షంగా లీక్‌ కాలేదు. కానీ Salesforce డేటా ద్వారా హ్యాకర్లు మరింత నిజమైనవిలా కనిపించేలా ఫిషింగ్‌ దాడులు చేయగలరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి వినియోగదారుడు భద్రతాచర్యలు కచ్చితంగా పాటించడం తప్పనిసరి.

Exit mobile version