విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు 200 నామినేషన్లు వేసి హరీష్ రావుకు బుద్ధి చెప్తామని అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి అన్నారు. సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో పోరాటాలకు బదులుగా ఒక కపట నాటకం ఆడి పెట్రోల్ పోసుకున్న వ్యక్తికి అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. 1386 మంది తెలంగాణ అమరవీరుల చావులకు కారణం హరీష్ రావెనని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను నేనున్నా అని ఉద్యమాలు చేపించి, కనీసం ఈరోజు ఆ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడానికి కూడా మీకు సమయం లేదా అని మండిపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పడానికి, తెలంగాణను రక్షించుకోవడానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ దళిత బిడ్డలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు, 1386 మంది చావులకు కారణమైన హరీష్ రావుకు మధ్య జరుగుతున్న పోటీయే ఈ ఎన్నిక అన్నారు. ఈ సమావేశంలో వేదిక సభ్యులు మమత, సునీత, లక్ష్మమ్మ, ప్రేమలత, లింగమ్మ, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.