వరంగల్:
Konda Surekha | వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరాటం మళ్లీ బహిర్గతమైంది. అటవీ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి, మంత్రి వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తి
నాయిని రాజేందర్‌రెడ్డి అభిప్రాయం ప్రకారం, కొండా సురేఖ తనను సంప్రదించకుండా భద్రకాళి దేవాలయ ట్రస్ట్‌లో ఇద్దరిని సభ్యులుగా నియమించడంపై నాయిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటువంటి చర్యలు పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదని అన్నారు. ఒకే జిల్లాకు చెందిన నేతలు పరస్పర అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కానీ మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం విభేదాలను మరింతగా పెంచుతుందని తెలిపారు.
ఇదే వరంగల్ కాంగ్రెస్‌లో మొదటిసారి కాదు. గత జూన్‌లోనే జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కొండా సురేఖ, భర్త కొండా మురళి జిల్లాలో ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, తమను పక్కనబెడుతున్నారని వారు ఆరోపించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. ఆ వేడుకలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని “ద్రోహులు”గా సంబోధించడం వివాదానికి దారి తీసింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు కేంద్రముఖ్యకార్యదర్శులకు ఫిర్యాదు చేస్తూ, కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొండా మురళి హైదరాబాద్‌లో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి వివరణ ఇచ్చారు. కానీ, భార్యాభర్తలు తిరిగి అదే రీతిన వ్యవహరించడం జిల్లా నేతలకు మింగుడుపడటం లేదు.
కొండా సురేఖ, కొండా మురళి–ఇతర ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన తాజా ఫిర్యాదు మరోసారి వరంగల్ కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత సమస్యలను బహిర్గతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ వర్గపోరాటం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.