విధాత: ఏపీలో పార్టీకి ఇబ్బంది ఉంటుందని తెలిసీ, తెలంగాణ బాగుపడాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. గాంధీ కుటుంబం మాటిస్తే తల తెగికింద పడ్డా.. మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పోలింగ్ బూతులో ఓటు వేసేందుకు వెళ్లే ముందు ఆరు గ్యారెంటీల కార్డుకు దండంపెట్టండి.. పూజచేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని మొక్కుదాం.. అని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకలకు ఈ ఆరు గ్యారెంటీలు వెలుగు అని చెప్పారు.
ఈ వెలుగులు మన జీవితంలోరావాలంటే నవంబర్ 30న మనం చేతి గుర్తు మీద ఓటేయాలని అన్నారు. డిసెంబర్ 9న ఎల్‌బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలని ఆహ్వానించారు. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద సంతకం పెడుతుందని చెప్పారు. వందరోజుల్లో ఈ పథకాలను అమలుచేస్తామని స్పష్టం చేశారు. సోమవారం వికారాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి జలాలేవి?
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయని సోనియా నమ్మారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రాణహిత – చేవెళ్ల ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు గలగల పారుతాయని, ఈ ప్రాంత రైతాంగం కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నదని, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇంకా గోదావరి జలాలు ఎందుకు అందలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అని కేటీఆర్ మాట ఇచ్చారని, మరి పదేండ్లు అయినా మన ప్రాజెక్టు ఎందుకు పడావు పడ్డదని నిలదీశారు. మన ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి, ఈ ప్రాంత రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, మన భూములు ఎడారిగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
తెంలగాణ రాష్ట్ర ప్రజల దశ దిశమార్చే ఈ సభ తెలంగాణకు మార్గదర్శనమని అన్నారు. చంద్రశేఖర్ రావును పదేండ్లు మోసిండ్రు. దళితబంధు, నిరుద్యోగభృతి, మైనార్టీలకు 12 శాతంరిజర్వేషన్లు వచ్చాయా? మనకు ఏంరాలేదు కానీ.. నీళ్లేమో జగన్ రెడ్డి, నిధులేమో కృష్ణా రెడ్డి, నియామకాలేమో కేసీఆర్ తీసుకోపోయారు. మనకు ఏం వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. నిన్నగాక మొన్న ప్రవళిక అనే సోదరి చనిపోయింది. ఆమె ఆత్మహత్యపై నిందలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ బిడ్డనో, నీ చెల్లోనే చనిపోతే లేని అభండాలు మీద వేస్తే ఎలా ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో ఆలోచించావా కేసీఆర్ అని నిలదీశారు.