ఆదిలాబాద్ బీఆరెస్ అభ్యర్థులకు చుక్కలు

  • Publish Date - November 7, 2023 / 02:02 PM IST

– ఎన్నికల హామీలపై జనం నిలదీతలు

– పలుచోట్ల గ్రామాల్లోకి రాకుండా అడ్డగింతలు

– 5 నియోజకవర్గాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి

– ప్రచారంలో గులాబీ నేతల ఎదురీత

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: గులాబీ దళానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరసనల మంటలు పుడుతున్నాయి. ఎన్నికల హామీల కుంటుబాటే ఆపార్టీ అభ్యర్థులకు సంకటంగా మారిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి లేదంటూ ప్రజలు బీఆరెస్ శ్రేణులపై తిరగబడుతున్నారు. ప్రచారాల్లో నాయకులు నిరసన సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అంటూ ఊదరగొట్టడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.


కొన్ని గ్రామాల్లో ప్రచారాలు చేయకుండానే వెనుదిరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీల వారీగా ఎవరికి వారు పోటా పోటీగా తమను గెలిపించాలని ఓటరు దేవుళ్ల దగ్గరికి వెళ్లి అభ్యర్థిస్తున్నారు. కొందరు ఆశించిన టికెట్ రాలేదని పార్టీలు ఫిరాయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందంటూ నిలదీస్తున్నారు. అధికార బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు ఇలాంటి నిరసన సెగలు అక్కడక్కడా తగులుతున్నాయి. కొంతమంది ఓటర్లు బయటకు చెప్పకుండా నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారన్న ఆందోళన ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలినవి.

గొర్లిస్తామని చెప్పి…

ఆదిలాబాద్ లో జోగు రామన్నకు నిలదీత

ఆదిలాబాద్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నపై పలు గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామంలో గొల్ల కురుమలు అడ్డుకున్నారు. మాకు గొర్లిస్తామని చెప్పి… మా దగ్గర నుండి డబ్బులు తీసుకొని సబ్సిడీ గోలి ఇవ్వలేదని ఆరోపించారు. మా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదంటూ అగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. జైనాథ్ మండలంలోని పార్టీ కె గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని గ్రామస్థులు నిరసన చేపట్టారు. జైనాథ్ మండలం లక్ష్మీపూర్ లో సైతం ప్రచారానికి వెళ్లిన వాహనాలను అడ్డుకున్నారు.

ముధోల్ విటల్ రెడ్డికీ నిరసన సెగ

ముధోల్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే విటల్ రెడ్డికీ నిరసన సెగ తప్పలేదు. వరుస ఘటనలతో సందిగ్ధంలో పడ్డారు. స్థానికంగా ఉన్న ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. తానూర్ మండలంలోని హంగీర్గా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్తే, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. మా ఊరికి ప్రచారానికి రావద్దంటూ అడ్డుకున్నారు. నిరసన సెగలతో గులాబీ నాయకులు ప్రచారంలో తడబడ్డారు.

బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సిటింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో పాటు గ్రామ పొలిమేరలోకి రాకుండానే ప్రచార వాహనాలను అడ్డుకుంటున్నారు. నెన్నెల మండలం కుశ్నాపల్లి పొలిమేరలో బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.10 ఏళ్ల కాలంలో మమ్మల్ని పట్టించుకోని మీరు మా ఊరికి ఎలా వస్తున్నారని నిలదీశారు. మహిళలు ఎక్కడికిఅక్కడ ప్రశ్నించడంతో తమ నాయకులు పోలీసుల సాయంతో గ్రామాల్లోకి వెళ్లడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మండలకేంద్రంలోని సుభాష్ నగర్ లో మహిళలు.. మాకు ఏం సదుపాయాలు చేశావని, ఏం పని చేసావని నిలదీశారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. డ్రైనేజీలు నిర్మించలేదని, మా ఇళ్లకు తాగునీరు కూడా అందించలేదని వాపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారానికి వెళ్తే, ఇలాంటి ఘటనలే పునరావృతమయ్యాయి.

చెన్నూరులో బాల్క సుమన్ కు..

చెన్నూరు నియోజవర్గంలో ఇలాంటి ఘటనలే బీఆరెస్ కు పునరావృతమయ్యాయి. చెన్నూరు మండలంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్లిన ప్రచార రథాలను స్థానికులు అడ్డుకున్నారు. పదేళ్ల కాలంలో పనితీరుపై ప్రజలు విమర్శలు గుప్పించారు. భీమారం మండలంలో ఓ కాలనీకి వెళ్తే, మాకు మౌలిక సదుపాయాలైన డ్రైనేజీ నిర్మించలేదని ఏకంగా బాల్క సుమన్ ను నిలదీశారు. తమ కాలనీలోకి రావద్దని అడ్డుకున్నారు. గత్యంతరం లేకపోవడంతో ఆ కాలనీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్ళిపోయారు.

మంచిర్యాలలో దివాకర్ రావుకు..

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకు సైతం సీతారాంపల్లి దళిత కాలనీలో ఇలాంటి ఘటనే ఎదుర్కొన్నారు. పదేళ్ల కాలంలో డ్రైనేజీ నిర్మించకపోవడంతో మేము ప్రతిరోజు బురదలో నడుస్తున్నామని గ్రామస్థులు వాపోయారు. మా వాడకు ఓట్ల కోసం రావద్దని ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఎలక్షన్లు అనంతరం నిర్మిస్తానని హామీ చెప్పడంతో ప్రచారం చేసుకోనిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నవి.


మౌలిక సదుపాయాలతో పాటు పథకాల అమల్లో పూర్తి లంచాలు తీసుకుంటున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలకే లబ్ధి అందుతోందన్న అపవాదును బీఆరెస్ మూటగట్టుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అధికార పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని వరసన ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఓట్ల రూపంలో నివురు గప్పిన నిప్పులా ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.