220కోట్ల పరీక్షల అప్లికేషన్ ఫీజుల దోపిడీ: పవన్ ఖేరా ధ్వజం

  • Publish Date - November 6, 2023 / 11:26 AM IST
  • ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించలేదు
  • ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా ధ్వజం

విధాత : తెలంగాణ ప్రభుత్వం 220 కోట్లు పరీక్షల అప్లికేషన్ ఫీజుల పేరుతో దోచుకుని ఒక్క పరీక్షనూ సరిగ్గా నిర్వహించలేకపోయిందని, ఆ డబ్బులన్నీ ఎక్కడికిపోయాయని ఏఐసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా నిలదీశారు. ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ అజయ్ కుమార్‌తో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోవడంతో 3600 యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా ఒక్క 2020లోనే కావడం బాధాకరమని, ఇది ఎన్‌సీఆర్‌బీ లెక్క అని స్పష్టం చేశారు.


రాజధాని నిరుద్యోగ రాజధానిగా మారిందన్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు ప్రజలను, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఇటీవల ఉద్యోగం రాక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే. ఆమె క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపిస్తున్నారని, కేసీఆర్ ఫాం హౌజ్‌లో రాజభోగాలను అనుభవిస్తుంటే ఇక్కడ ప్రజలు కష్టాలు పడ్తున్నారన్నారు.


కేసీఆర్‌ను శాశ్వతంంగా ఫౌంహౌజ్‌కే పరిమితం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఎన్నికల్లో ప్రజలు సరైన గుర్తు ప్రజా నేస్తం హస్తంపై మీట నొక్కి కేసీఆర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ మీడియా చైర్మన్‌ కుసుమ కుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.