విధాత, హైదరాబాద్ : తెలుగు ప్రజలను విశేషంగా ఆకర్షించిన బలగం చిత్రం ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలగం చిత్ర బృందానికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా బలగం ఎంపికవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దర్శకుడు వేణును, చిత్ర బృందాన్ని అభినందించారు. “ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. భవిష్యత్‌లో మరిన్ని సాధించేందుకు ఇది తొలిమెట్టు” అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్నదమ్ముల, కుటుంబ సభ్యుల బాంధవ్యాలను, భావోద్వేగాలను చాటుతూ చిత్రీకరించిన బలగం చిత్రం తెలుగు ప్రజల్లో , ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ప్రతి పల్లెకు చేరిన చిత్రంగా విశేష ప్రజాదరణ పొందింది. ప్రతి గ్రామంలో గ్రామ పెద్దలు పోటీలు పడి మరి ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా దక్కడం పట్ల అభినందలు వెల్లువెత్తుతున్నాయి.