విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించినందునా ..ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఏం చేస్తారో ఇప్పుడు చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం రావొద్దని రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలన నడుస్తుందన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపకుండా రేవంత్ రెడ్డి కేంద్రం మీద నెపం వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అర్బన్ నక్సలైట్లు చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. వారు మాత్రం పదవులు పొందుతూ..కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
హనుమంతుడిపై సినీ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్బంగా స్పందించారు. దేవుడు కరుణించి.. రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చాలని కోరుకుంటున్నానని సంజయ్ అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో జక్కన్న నిండు నూరేళ్ళు బ్రతికి.. మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
