Sonia Gandhi Health | కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌కు తరలించారు. మంగళవారం ఉదయం ఆమె ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. రోజువారీ ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వచ్చినట్టు చెబుతున్నా.. ఆమె తీవ్ర దగ్గు, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీలో తీవ్ర కాలుష్య సమస్య ఉంది. ఇది కూడా తోడవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అంటున్నారు.
సోనియాగాంధీకి బ్రాంఖైల్ ఆస్తమా ఉంది. ఢిల్లీలో అతి శీతల వాతావరణం, కాలుష్యం కారణంగా ఇది మరింత పెరిగిందని మెడికల్ చెకప్స్‌లో తేలినట్టు చెబుతున్నారు. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని, ఛెస్ట్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారని సమాచారం. చికిత్సకు ఆమె బాగా రెస్పాండ్ అవుతున్నారని తెలుస్తున్నది.
79 ఏళ్ల సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రత్యేకించి అతిశీతల వాతావరణం, కాలుష్యంతో ఆమె మరింతగా ఇబ్బంది పడుతున్నారు.
పొట్ట సంబంధ సమస్యలతో సోనియాగాంధీని 2025 జూన్లో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆ సమయంలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.
