- ఏక్యూఐ సూచీలో పడిపోతున్న వాయు నాణ్యత
- నానాటికీ పెరుగుతున్న వాహనాలు, నిర్మాణ వ్యర్థాలతో ధూళి
- జాగ్రత్తలు పాటించాలంటున్న ఆరోగ్య నిపుణులు
Hyderabad Unhealthy Air Quality | కాలుష్యంతో రాజధాని ఢిల్లీ నగరం ఎలా తల్లడిల్లిపోతున్నదో చూస్తున్నాం. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, పంట కొయ్యల దహనం.. నిర్మాణ రంగ కార్యకలాపాల్లో వెలువడే ధూళి, తగ్గిపోతున్న పచ్చదనం.. ఇలా అనేక కారణాలు ఢిల్లీలో కాలుష్య భూతం జడలు విప్పడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సరిగ్గా పోల్చిచూస్తే అవే తరహా పరిస్థితులు కొంత మేరకు హైదరాబాద్ నగరంలోనూ కనిపిస్తాయి. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో వాహనాలు, అవి వెదజల్లే పొగలతో ఆ రోడ్డునపోయేవారికి నరకం కనిపిస్తున్నది. ప్రత్యేకించి చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా కనిపిస్తున్నది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 150 నుంచి 250కి పైగా నమోదు అవుతున్నది. అంటే.. మధ్యస్థ స్థాయిని దాటుకుని, పూర్, అన్‌హెల్తీ దిశగా సాగుతున్నది. ఉత్తర హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వెంట ఏక్యూఐ అధికంగా ఉంటున్నది. రియల్ ఎస్టేట్ పుణ్యామాని హైదరాబాద్ చుట్టుపక్కల పచ్చటి పొలాలు, చెట్లు కొట్టుకుపోతున్నాయి. అక్కడ జరిగే నిర్మాణ కార్యకలాపాలతో ధూళి బాగా పెరుగుతున్నది.
బుధవారం నాటి రికార్డులను గమనిస్తే.. ఓవరాల్‌గా హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి 175గా నమోదైంది. వివిధ అంశాల్లో ‘గుడ్’, ‘మాడరేట్’, ‘పూర్’, ‘అన్‌హెల్తీ’, ‘సివియర్’, హెజార్డస్‌గా వర్గీకరిస్తారు. హైదరాబాద్‌లో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 10) పూర్ స్టేజ్‌లో 111µg/m³గా నమోదైంది. పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం2.5) 93µg/m³గా నమోదైంది. ఇది అనారోగ్యకరం. పీఎం2.5 అనే పార్టికిల్స్.. 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. మనిషి తల వెంట్రుక కంటే సుమారు 30 రెట్లు చిన్నవి. అందుకే అవి మన కంటికి కనిపించవు. అవి మనం గాలి పీల్చుకున్నప్పుడు అవి మన శ్వాసతో కలిసి.. నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడే ఆగకుండా.. రక్త ప్రసరణలో కలిసిపోవడం వల్ల గుండె, మెదడు వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పీఎం2.5ను మౌన హంతకుడిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. పైకి గాలి శుభ్రంగా అనిపించినా.. వీటి కారణంగా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగే అవకాశాలు ఉంటాయి. పీఎం10 సూక్ష్మ కణాలు కూడా ఇంతే. ప్రత్యేకించి చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి మరింత ఇబ్బంది ఏర్పడుతుంది.
హైదరాబాద్‌లో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, కట్టడిలేకుండా సాగుతున్న నిర్మాణాలు, పారిశ్రామిక వాడల నుంచి వెలువడే కాలుష్యం.. అన్నీ కలిసి.. హైదరాబాద్ గాలి నాణ్యతను గణనీయంగా తగ్గించేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలను పరిగణనలోకి తీసుకుంటే.. గడిచిన నాలుగేళ్ల కంటే అధికంగా కాలుష్యం పెరిగింది. దీనికి సంబంధించిన గణాంకాలు https://www.aqi.in/ ఉన్నాయి.
2021 డిసెంబర్ 1వ తేదీన ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 160గా ఉంటే.. అది 2022లో 132, 2023లో 80, 2024లో 112గా రికార్డయింది. 2025 డిసెంబర్ 1న అది 164గా నమోదైంది. ఇక డిసెంబర్ 17వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటే.. 2021లో 162, 2022లో 131, 2023లో 102, 2024లో 139గా రికార్డయింది. 2025 డిసెంబర్ 17వ తేదీన ఏకంగా 208 పాయింట్లుగా నమోదుకావడం గమనార్హం. మంగళవారం అంటే.. డిసెంబర్ 23, 2025న అది 204గా ఉన్నది. మొత్తంగా చూస్తే గత ఐదేళ్లలో నగరంలో కాలుష్యం స్థాయి పెరిగిందనేది స్పష్టమవుతున్నది.
బుధవారంనాడు.. అమీన్‌పూర్, ఆసిఫ్ నగర్, సీతారాం బాగ్ రోడ్, బంజారా హిల్స్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతం, సెంట్రల్ యూనివర్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్, కాప్రా, కోకాపేట్, కొంపల్లి మున్సిపల్ కార్యాలయం, కోటి, కేపీహెచ్‌బీ ఫేజ్ 2, కూకట్‌పల్లి, లలిత నగర్, మాదాపూర్, మణికొండ, ముత్తంగి, నార్సింగి, న్యూ మలక్‌పేట్, పత్రికా నగర్, పోచమ్మ బాగ్ కాలనీ, పుప్పాలగూడ, రామచంద్రాపురం, సైదాబాద్, సనత్‌నగర్, షిర్డీ సాయి నగర్, సోమాజిగూడ, శ్రీ మారుతీ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీ, తిరుమల నగర్, విట్టల్ రావ్ నగర్, జూ పార్క్ ప్రాంతాలు అన్‌హెల్తీగా ఉన్నాయని గాలి నాణ్యత సూచీ ప్రకారం తెలుస్తున్నది. విధుల నిమిత్తం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also |
Future City : ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ఊపు… రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందా?
Grape Cultivation | సిరులు కురిపిస్తున్న ద్రాక్ష సాగు.. ఏడాదికి రూ. 75 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
Zodiac | 2026లో ఈ ఐదు రాశుల వారు.. అప్పుల ఊబి నుంచి బయపడుతారు..!
