State of Global Air-2025 Report | వాయు కాలుష్యంతో డిమెన్షియా మరణాలు.. తాజా అధ్యయనం హెచ్చరిక

ఏటా చోటుచేసుకునే మరణాల్లో 79 లక్షల మరణాలు వాయుకాలుష్యం వల్లేనే అంటే ఆశ్చర్యమే. అంటే.. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒక మరణానికి కారణం.. వాయుకాలుష్యం! గ్లోబల్‌ ఎయిర్‌ రిపోర్ట్‌ 2025 ద్వారా ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

PM2.5 health impact AI created Image

State of Global Air-2025 Report | గత పదిపదిహేను రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయి.. పట్టపగలు సైతం సాయంసంధ్యా సమయాలను ప్రతిబింబించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టాయి. ఒక దశలో లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులకు కూడా ప్రభుత్వం ఆలోచనలు చేసింది. కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నది. అయినా పరిస్థితిలో గణనీయమైన మార్పులు లేవు. అనేక మంది చిన్నారులు, వృద్ధులు శ్వాస కోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా తయారై కూర్చొన్నది. ఆఖరుకు ఇది మరణాలకు, ప్రత్యేకించి డిమెన్షియా మరణాలకు సైతం దారి తీస్తున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏటా చోటుచేసుకునే మరణాల్లో 79 లక్షల మరణాలు వాయుకాలుష్యం వల్లే అంటే ఆశ్చర్యమే. అంటే.. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒక మరణానికి కారణం.. వాయుకాలుష్యం! గ్లోబల్‌ ఎయిర్‌ రిపోర్ట్‌ 2025 ద్వారా ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పీల్చుతున్న కాలుష్య వాయువులపై అధ్యయనం చేసి, ఈ నివేదిక విడుదల చేశారు. ఈ అధ్యయనానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా హెల్త్‌ సైంటిస్ట్‌ మైఖేల్‌ బ్రౌయర్‌ నేతృత్వం వహించారు. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా రోజు వారీగా మనుషులను ఎలా వ్యాధులు, అకాల మరణాల బారిన పడేస్తున్నదనేదే ఆయన పరిశోదన ప్రధానాంశం.

ఒక మనిషి సగటున జీవించాల్సిన కాలం కంటే ముందుగానే చనిపోవడం, అనారోగ్యం, వైకల్యంతో జీవించడం, హాస్పిటళ్ల చుట్టూ తిరగడం, స్కూలుకు వెళ్లకపోవడం, ఉద్యోగులైతే తమ ఉద్యోగాలు చేయలేకపోవడం వంటివి ఆరోగ్య సంవత్సరాల నష్టంగా పరిగణిస్తారు.

వాయు కాలుష్యంతో శరీరానికి ఏంటి నష్టం?

ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు పీఎం2.5 రేణువులపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇవి 2.5 మైకోమీటర్ల కన్నా చిన్న రేణువులు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోకి వెళ్లిపోగలవు. ఈ రేణువుల వల్లనే ఏటా 49 లక్షల మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. దీర్ఘకాలంగా ఇటువంటి గాలిని పీల్చడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడం, గుండెపోటు, స్ట్రోక్స్‌, ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటాయి.

మెదడు ఆరోగ్యానికీ ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. PM2.5కి సురక్షిత స్థాయి 5 మైక్రోగ్రాములు. కానీ.. ప్రపంచంలో 99 శాతం మంది కంటే ఎక్కువగా కాలుష్య గాలినే పీల్చుతున్నారు. కలుషితమైన గాలిని పీల్చినప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రవాహంలోకి వెళ్లిపోతాయి. తద్వారా గుండె, మెదడు, ఇతర కీలక అవయవాలకు చేరుతాయి. వాయుకాలుష్యం ఫలితంగా ఏడాదిలో వయోవృద్ధుల్లో 6.26 లక్షల డిమెన్షియా మరణాలు సంభవించాయి. అంతేకాదు.. 1.16 కోట్ల మెదడు సంబంధిత ఆరోగ్య సంవత్సరాల నష్టం చోటు చేసుకున్నది.

పేద దేశాల్లో మరీ దుర్లభం

పేద, మధ్య ఆదాయ దేశాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. మొత్తం మరణాల్లో 90శాతానికిపైగా వాయు కాలుష్యం కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. బలహీనమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు అందుకు తోడయ్యాయి. ఫలితంగా పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం పడుతున్నది. ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది పీఎం2.5 స్థాయి 35 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏమిటంటే.. ప్రపంచ జనాభాలో సుమారు 11 శాతం మంది ఇంకా అసలు జాతీయ గాలి నాణ్యతా ప్రమాణాలు లేని దేశాల్లోని వారేనట.

ఏం చేయాలి?

ప్రభుత్వాలు ప్రాథమికంగా ఈ చర్యలు తీసుకుంటే అనేక నగరాల్లో కాలుష్యం తగ్గిందని ఈ నివేదిక పేర్కొన్నది. వ్యక్తిగతంగా కూడా వాయు కాలుష్యాన్ని వెదజల్లే పనులు చేయకపోవడం, కాలుష్యానికి గురికాకుండా.. రద్దీ మార్గాలను వదిలి, ట్రాఫిక్‌ లేని మార్గాల్లో ప్రయాణించడం, మాస్క్‌ తగిన విధంగా పెట్టుకోవడం వంటివి చేయడం ద్వారా కాలుష్యానికి ప్రభావితం కాకుండా జాగ్రత్త పడవచ్చు. గాలి పరంగా పరిశుభ్రంగా భావించే నగరాలు సైతం అనారోగ్యకర గాలులతో నిండి ఉంటున్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Read Also |

Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్..తాజా వీడియోలతో బీఆర్ఎస్ ఎటాక్
Bade Chokka Rao : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?
Havan Statue Of Liberty Collapses : స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది !

Latest News