Air India | ఎయిరిండియాలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ ( Employee Leisure Travel ) ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్లను పలువురు అధిక ధరలకు అమ్ముకున్నట్లు సంస్థ అంతర్గత విచారణలో బయటపడింది. దాదాపు 4వేల మంది ఉద్యోగులు ఈ పాలసీని దుర్వినియోగం చేశారని తెలిసింది. దీంతో వారిపై చర్యలకు ఎయిరిండియా సిద్ధమైంది.
ఏడాదికి ఉచితంగా 14 టికెట్లు
ఎయిరిండియాలో ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ ( Employee Leisure Travel ) కింద ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి వంటి కుటుంబసభ్యులను విమానాల్లో ఉచితంగా తీసుకెళ్లేందుకు కొన్ని టికెట్లు జారీ చేస్తుంటుంది. ఈ పాలసీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 14 టికెట్లు పొందవచ్చు. అయితే ఎయిరిండియాలో 24వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 4వేల మందికిపైగా సిబ్బంది ఈ టికెట్లను దుర్వినియోగం చేశారని సంస్థ ఇటీవల గుర్తించింది.
అంతర్గత విచారణతో వెలుగులోకి!
పలువురు ఉద్యోగులు తమతో ఎలాంటి రిలేషన్ లేని వారిని కూడా తమ కుటుంబసభ్యులుగా చూపించి, ఉచిత టికెట్లపై వారిని విమానాల్లో తీసుకెళ్లినట్లుగా ఎయిరిండియా అంతర్గత విచారణలో తేలింది. ఇందుకోసం వారి నుంచి అధిక ధరలు వసూలు చేశారని గుర్తించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఉల్లంఘనలు, క్లైయిమ్‌లు జరిగినట్లుగా ఎయిరిండియా కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే నిర్దిష్టంగా ఎంతమంది ఉద్యోగులు లీజర్ ట్రావెల్ పాలసీని దుర్వినియోగం చేశారు? ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు? ఎంత సొమ్ము పొందారే విషయాలు మాత్రం బయటకు రాలేదు.
పెనాల్టీ విధించే యోచనలో ఎయిరిండియా
ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలకు ఎయిరిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దుర్వినియోగానికి పాల్పడిన 4 వేలమంది ఉద్యోగుల నుంచి మోసపూరితంగా పొందిన ప్రయోజనాలకు సంబంధించిన సొమ్మును తిరిగి రాబట్టడంతో పాటు, పెనాల్టీలు సైతం విధించే అవకాశం ఉందని తెలిసింది.
Read More :
కాంగ్రెస్‌ను వీడి కారెక్కనున్న జగిత్యాల జీవన్‌రెడ్డి?
నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య
