కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్.. జీవన్‌రెడ్డి చూపు బీఆర్ఎస్ వైపు?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో విభేదాలు, పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న అసంతృప్తి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.
కాంగ్రెస్‌లో అసంతృప్తి నేపథ్యంలో రాజకీయ భవిష్యత్‌పై జీవన్ రెడ్డి సహచరులతో తీవ్రంగా చర్చిస్తున్నారు
Big Shock to Congress in Telangana: Jeevan Reddy Likely to Join BRS
హైలైట్స్
- కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి
- ఈ నెల 25న బీఆర్ఎస్‌లో చేరే అవకాశం?
- ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో విభేదాలే ప్రధాన కారణం
- కేటీఆర్‌తో ఇప్పటికే చర్చలు జరిగినట్లు టాక్
విధాత తెలంగాణ డెస్క్ | 15 మార్చి 2026 | కరీంనగర్:
కాంగ్రెస్‌లో అవమానం… బీఆర్ఎస్‌లో ఆహ్వనం
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో తనకు ప్రాధాన్యత తగ్గిందన్న భావనతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆయన వర్గం భావిస్తోంది. తనను సంప్రదించకుండా ప్రత్యర్థి నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం అవమానకరమని జీవన్ రెడ్డి పలుమార్లు బాహటంగానే వ్యాఖ్యానించారు.

జగిత్యాల రాజకీయాల్లో విభేదాలకు కేంద్రంగా మారిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ – సీనియర్ నేత జీవన్ రెడ్డి
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో కూడా తన వర్గానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆవేదన చెందారు. ఈ కారణంగా జీవన్ రెడ్డి అనుచరులు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం కూడా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను బయటపెట్టింది.
కేటీఆర్‌తో చర్చలు ఫలప్రదం – త్వరలో కేసీఆర్‌తో భేటీ?
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఈ నెల 20 తర్వాత హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలుసుకుని, 25న బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే జగిత్యాలలో తన అనుచరులతో జీవన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారం నడుస్తున్న వేళ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి (File)
కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పరిణామాలను గమనిస్తూ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై ఆయన అసంతృప్తి తగ్గకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ను వీడేది ఖాయమని ఆయన ఘంటాపథంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలన్నీ రేవంత్‌రెడ్డి వ్యూహంలో భాగమేనని ఆయన బలంగా నమ్ముతున్నారు.
జీవన్ రెడ్డి నిజంగా బీఆర్ఎస్‌లో చేరితే జగిత్యాల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఇది రాజకీయంగా బలం చేకూర్చే అంశంగా మారవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram