Air India 15000 Crore Loss | ఎయిర్‌ ఇండియాకు కోలుకోలేని దెబ్బ.. విమాన ప్రమాదం తర్వాత రూ.15 వేల కోట్ల నష్టం..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌ ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల వరకు నష్టం నమోదయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Air India 15000 Crore Loss | ఎయిర్‌ ఇండియాకు కోలుకోలేని దెబ్బ.. విమాన ప్రమాదం తర్వాత రూ.15 వేల కోట్ల నష్టం..!

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా (Air India) సంస్థను నాలుగేండ్ల క్రితం తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్‌.. దానిని గాడిన పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడేలా సంస్థను తీర్చి దిద్దేందుకు ప్రణాళిక వేసింది. అయితే, గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం టాటా సంస్థకు పెను సవాళ్లను తెచ్చిపెట్టింది. ఎయిర్‌ ఇండియాను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న సంస్థ ఆకాంక్షలపై బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ రూపంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. గతేడాది జరిగిన విమాన ప్రమాదం తర్వాత సంస్థ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

గతేడాది జూన్‌ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. లండన్‌ బయల్దేరిన డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదం తర్వాత సంస్థ నష్టాల బాట పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసే ఏడాది) కంపెనీ ఏకంగా రూ.15 వేల కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ నివేదిస్తోంది. ప్రమాదానికి ముందు మెల్లగా లాభాల దిశగా అడుగులు వేస్తున్న సమయంలో డ్రీమ్‌లైనర్‌ విమాన ప్రమాదం సంస్థపై చీకట్లు కమ్మేసింది. టాటా గ్రూప్ (Tata Group), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines) కలిసి నిర్వహిస్తున్నఈ విమానయాన సంస్థకు డ్రీమ్‌లైనర్‌ ప్రమాదంతోపాటూ పాక్‌ నిర్ణయం కూడా నష్టాలకు కారణమైంది.

భారత్‌తో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఎయిర్‌లైన్స్‌కు తమ గగనతలాన్ని దాయాది మూసివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఢిల్లీ, ఉత్తర-పశ్చిమ ప్రాంతాల నుంచి ఐరోపా, యూఎస్‌కు వెళ్లాల్సిన విమానాలను చుట్టూ తిప్పి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో అదనపు వ్యయాలు భారమయ్యాయి. ఇది కూడా సంస్థ నష్టాలకు ఓ కారణమని సదరు నివేదిక తెలిపింది. ఇవి మాత్రమే కాదు, గతేడాది భారత విమానయాన రంగం మొత్తం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంది. తరచూ విమాన ఆలస్యాలు, బాంబు బెదిరింపులతో ప్రయాణికుల్లో భయం, విమానాల రద్దు వంటి ఘటనలు విమానయాన రంగాన్ని కుదిపేశాయి.

ఇక గత మూడు సంవత్సరాల్లోనే ఎయిర్ ఇండియా సంస్థ మొత్తం రూ.32,210 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో విస్తారాతో విలీనం తర్వాత ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కొనుగోలు చేసిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇప్పుడు ఈ నష్టాల భారాన్ని అనుభవిస్తోంది. ఎయిర్ ఇండియా పేలవమైన పనితీరు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆదాయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఎయిర్‌ ఇండియా సంస్థ ఇప్పట్లో లాభాల బాట పట్టడం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎయిర్‌ ఇండియా ప్రమాదం..

గతేడాది జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. విమానం బిల్డింగ్‌పై కూలడంతో మరికొంతమంది కూడా చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు టాటా సన్స్‌ ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. అంతేకాదు, తక్షన ఆర్థిక సాయం కింద రూ.25 లక్షలు చొప్పున ఇచ్చింది. ప్రస్తుతం ఈ దుర్ఘటపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి :

Gravity Lose Fact Check | ఆ రోజు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్న భూమి.. వాస్తవాలేంటి? నాసా ఏం చెబుతున్నది?
NIMS Model District Hospitals | కార్పొరేట్‌ దోపిడికీ చెక్‌ పెట్టేలా నిమ్స్‌ తరహాలో జిల్లాకొక టిమ్స్‌!