NIMS Model District Hospitals | కార్పొరేట్ దోపిడికీ చెక్ పెట్టేలా నిమ్స్ తరహాలో జిల్లాకొక టిమ్స్!
కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టడం, ఆరోగ్య శ్రీ పేరిట బిల్లు చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగ బలోపేతంపై దృష్టి సారిస్తున్నది. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే నిమ్స్ తరహాలో జిల్లాకొక టిమ్స్ హాస్పిటల్‌ను నిర్మించేందుకు ఆలోచనలు చేస్తున్నదని వైద్యారోగ్య శాఖలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
విధాత, హైదరాబాద్:
NIMS Model District Hospitals | ఏ చిన్నపాటి వైద్య సేవలు అవసరమైనా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో లక్షలకు లక్షలు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. ఔట్ పేషెంట్ (ఓపీడీ) ఫీజులే మినిమం రూ.300 నుంచి రూ.1500ల వరకు ఆయా ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు అవసరం ఉన్నా.. లేకున్నా టెస్టుల పేరుతో గుంజేది వేరు. చిన్నపాటి వ్యాధులకు సైతం ఎంఆర్ఐలు, స్కానింగ్‌లు, రకరకాల బ్లడ్ టెస్ట్‌లు నేడు సర్వసాధారణం అయిపోయాయి. ఏదైనా నొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళితే ఫీజు కాకుండా అవసరం ఉన్నా లేకున్నా తక్కువలో తక్కువ 10 వేల రూపాయల వరకు టెస్ట్‌లు చేయిస్తున్నారని మధుసూదన్ అనే వ్యక్తి చెప్పారు. టెస్ట్‌లు చేయించడానికి వెళితే ప్యాకేజీల పేరుతో అవసరం ఉన్నా లేకున్నా అదనపు టెస్ట్‌లు కూడా చేయిస్తారని అంటున్నారు.
ఏ వ్యక్తికి అయినా ప్రాణ భయం ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి ఏదోరకమైన వ్యాధులకు గురవుతూనే ఉన్నాడు. ప్రాణ భయంతో డాక్టర్ సూచించినవన్ని పాటించేవాళ్లు ఎక్కువ. అయితే.. మనిషిలోని ఈ ప్రాణభీతిని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లు క్యాష్ చేసుకుంటున్నాయన్న విమర్శలు ఇప్పటివి కావు. హాస్పిటళ్ల దోపిడీని ఎండగడుతూ అనేక సినిమాలు సైతం వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కుటుంబంలో ఎవరికైనా ఏదైనా తీవ్రమైన జబ్బు చేస్తే.. అతడిని కాపాడుకునేందుకు ఆ కుటుంబం ఎంతదాకానైనా వెళుతుంది. ఉన్న ఆస్తులు అమ్ముకొనో.. లేదా అప్పులు చేసి మరీ అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మానవ సమాజంలో బాంధవ్యాలతో ముడిపడిన బలహీనత ఇది. కానీ.. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కార్పొరేట్ హాస్పిటళ్లు.. వైద్య సేవలకంటే కాసులు వసూలు చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
సాధారణ చిన్న హాస్పిటళ్లలో సైతం ఐసీయూ చార్జీలు 8 వేల నుంచి 15వేల రూపాయల వరకూ ఉంటున్నాయి. కార్పొరేట్ హాస్పిటళ్ల సంగతి అయితే.. లక్షల్లోనే! 2025 ఏప్రిల్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక ఐటీ ఉద్యోగినిని వెంటనే ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళితే రెండు రోజుల్లోనే దాదాపు రూ. 5 లక్షల వరకు బిల్లు చేశారు. ఇంతటితో ఆగని సదరు కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం.. ఇదే సందుగా మరింత దండుకునే ప్లాన్ చేసింది. అప్పటికే కోమాలోకి వెళ్లిన సదరు పేషంట్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని, వెంటనే లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పారు. అలాగే ట్రైకాస్టమీకి మరో రూ. 90 వేలు అవుతుందని, ఈ మేరకు బిల్లింగ్ సెక్షన్‌లో డబ్బు చెల్లించి రశీదు తీసుకు వస్తే ప్రిపరేషన్ చేస్తామని పేషంట్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆసుపత్రి తీరుపై అనుమానం వచ్చిన ఆ తల్లిదండ్రులు వేరే వారితో సంప్రదించిన తరువాత మోసం జరుగుతుందని గ్రహించారు. పేషంట్‌ను డిశ్చార్జ్ చేయించుకుని, నిమ్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
‘మేము ఆ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పిన మాట విని అక్కడే ఉంటే మాకు అమ్మాయి దక్కేది కాదు… నేను సంపాదించుకున్న ఇల్లుతో పాటు యాదాస్తి సదరు ఆసుపత్రికే చెల్లించాల్సి వచ్చేది’ అని ఆ పేషెంట్ తండ్రి ‘విధాత’ ప్రతినిధితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రైకాస్టమీకి రూ.90 వేలు బిల్లు చెప్పారని, నిమ్స్‌లో మాత్రం ఒక కిట్ చెప్పి, దానిని తీసుకువెళితే ట్రైకాస్టమీ వేశారని ఆయన తెలిపారు. నయాపైస అదనంగా ఖర్చు కాలేదని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలో లక్ష రూపాయలకు అయ్యే వైద్యం కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసే ప్రమాదం ఉందని వైద్యశాఖలోని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్టు తలనొప్పి వస్తుండటంతో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లాడు. సాధారణ పరీక్షల అనంతరం సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. డోలో 650, స్లీపింగ్ పిల్స్ ఇచ్చి, వారం రోజులు వాడమన్నారు. ఈలోపు సీటీ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పారు. సరే మూడు రోజుల తర్వాత సదరు జర్నలిస్టు సీటీ రిపోర్టు తీసుకుని వెళ్లి చూపించాడు. అంతా బానే ఉంది.. రాత్రి టైమ్‌కు నిద్రపో అని చెప్పి పంపించేశారు! ఈ మాత్రం చెప్పడానికి సీటీ అవసరమా? అని సదరు జర్నలిస్టు ఆశ్చర్యపోయాడు.
ప్రైవేట్ ఆసుపత్రులు గతంలో డాక్టర్లే యజమానులుగా ఉండి నిర్వహించే వారు. దీంతో డాక్టర్ల పేరుతోనే ప్రైవేట్ ఆసుపత్రులు నడిచేవి.. డాక్టర్లు కూడా వచ్చిన మనుషులను, వారి పేమెంట్ పరిస్థితిని చూసి ఫీజు అడిగే వారు కాదు.. మరీ పేదలు వస్తే ఫీజు కూడా తీసుకునేవారు కాదు. చాలా మంది నాడిపట్టుకొని మొత్తం చెప్పేసేవారు. వైద్య పరీక్షలు ఏమైనా ప్రత్యేక కేసులు ఉంటేనే రిఫర్ చేసేవారు. కానీ.. ఇప్పుడు ప్రతిదానికీ అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు తప్పనిసరిగా మారిపోయాయని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ వైద్యుడు చెప్పారు. రాను రాను పరిస్థితి మారింది. డాక్టర్ల స్థానంలో ఆసుపత్రుల యజమానులుగా బడా పెట్టుబడిదారులు వచ్చారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి అతి తక్కువ కాలంలో రూ. 200 కోట్లు ఎలా వసూలు చేయాలన్న యావనే తప్ప… కనీసం సర్వీస్ చేసే యోచనలో కూడా ఉన్నట్లు కనిపించడం లేదని సదరు గ్రామీణ ప్రాంత వైద్యుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడి దారులు నిర్వహించే ఆసుపత్రులలో డాక్టర్లకు టార్గెట్లు విధిస్తున్నారని, దీంతో డాక్టర్లు సాధ్యమైన మేరకు ఇష్టం లేకున్నా ఫీజులు, డయాగ్నస్టిక్ పరీక్షల రూపంలో గుంజటమే లక్ష్యంగా మారిందని చెపుతున్నారు. టార్గెట్ రిచ్ కాలేని డాక్టర్లను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నారని సమాచారం.
మహిళలకు వయసు పెరిగిన తరువాత కొంతమందికి హిస్టరెక్టమీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా చిన్న సర్జరీ. ఖర్చు రూ. 15 నుంచి రూ.20 వేలకు మించదు. కానీ, రూరల్ ప్రాంతాలలో రూ.30 వేల వరకు వసూలు చేస్తారని, హైదరాబాద్ నగరంలో మామూలు ఆసుపత్రులలో లక్ష రూపాయలు, కార్పోరేట్ ఆసుపత్రులలో రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. వివిధ జిల్లా కేంద్రాలు, తాలూకా, మండల కేంద్రాలలో మహిళలు చిన్న వయసు వారు కూడా నెలసరి సమస్యతో బాధ పడుతూ ఆసుపత్రులకు వెళితే అవసరం ఉన్నా లేకున్నా హిస్టరెక్టమీ చేసి.. గర్భసంచి కోసిపారేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వద్ద కూడా రిపోర్ట్ ఉన్నట్లు సమాచారం.
ఇలా ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లి కార్పోరేట్ గా మారిన తరువాత వైద్య రంగంలో దోపిడీ తీవ్ర తరం అయిందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అయితే వైద్య రంగంలో దోపిడిని అరికట్టలేని నిస్సహాయ స్థితిలో సర్కారు ఉందన్న అభిప్రాయం కూడా ఉన్నది. వైద్య శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి మాట్లాడుతూ ఏ ఆసుపత్రిని కూడా కంట్రోల్ చేసే స్థితి సర్కారుకు లేదన్నారు. పైగా ఎవరిని కూడా మానిటర్ చేయలేదని, వాళ్లే ప్రభుత్వాలను ఆడించే స్థితిలో ఉన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో తెల్ల బట్టలు వేసూ కొని కార్లలో తిరిగే వాళ్లు కూడా ఒక్కసారి ఆసుపత్రికి వెళితే బికారి కావాల్సిన పరిస్థితి ఉందని సదరు అధికారి అభిప్రాయ పడ్డారు. నెలకు లక్ష రూపాయలు సంపాదంచే వాడు.. బ్యాంకులో రూ. 10 లక్షలు బ్యాంక్ బాలెన్స్ మెంటెయిన్ చేసే వాడికి ఒక్కసారి ఆసుపత్రికి వెళితే బ్యాలెన్స్ నిల్ అవుతుందన్నాడు. ఇందుకు తనకు చెందిన వారికి ఒకరికి అయిన ఎక్స్‌పీరియన్స్ వివరించాడు.
అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నాలు?
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపీడిపై ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అయితే ఏవిధంగా దీనికి అడ్డకట్ట వేయాలన్నది శగా సమాలోచనలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లను నిమ్స్ ఆసుపత్రికే ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పూర్తి చేసుకొని వస్తున్న వారికి సీఎం ఆర్ ఎఫ్ కింద నేరుగా పేషెంట్‌కే ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీనిని మరింత విస్తృతం చేయాలని చూస్తున్నారు. నిమ్స్ తరహాలోనే ఇప్పటికే తెలంగాణ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరిట హైదరాబాద్ నగరంలో నాలుగు పెద్దాసుపత్రులు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నలుమూలలా నిమ్స్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెపుతున్నారు. ఇదే పద్ధతిలో అన్ని జిల్లాల్లో నిమ్స్ తరహాలో ఒక ఆసుపత్రి నిర్మించాలన్న యోచన కూడా చేస్తున్నారని తెలుస్తున్నది. ఇలా జిల్లకు ఒక ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉంటారని, ఈ తీరుగానే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు చెక్ పెట్టవచ్చునని అంటున్నారు. ఈ దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య విద్య కళాశాలల సంఖ్య జిల్లా కేంద్రాల్లో పెరిగిన నేపధ్యంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చారని, దీంతో డాక్టర్ల కొరత కూడా ఉండదని ఉన్నతాధికారులు చెపుతున్నారు. మరోవైపు ఆరోగ్య శ్రీ పేరుతో ప్రయివేట్ హాస్పిటళ్లకు చెల్లించే మొత్తాలు జిల్లాల్లో నెలకొల్పే నిమ్స్ తరహా హాస్పిటళ్లకు చెల్లిస్తే.. ఉభయ ప్రయోజనకారిగా ఉండటమే కాకుండా.. కార్పొరేట్ దందాకు చెక్ పడుతుందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Also |
Naini Coal Block | నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు : ఆరోపణల నేపథ్యంలో వెనక్కితగ్గిన సింగరేణి
Anant Ambani Vantara Watch | అనంత్ అంబానీ ‘వంతారా’ థీమ్‌తో లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Medaram | మేడారంలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు..! గజం స్థలం రూ. 10 వేల పైమాటే..!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram