Naini Coal Block | నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు : ఆరోపణల నేపథ్యంలో వెనక్కితగ్గిన సింగరేణి
నైని కోల్ బ్లాక్ తవ్వకాల టెండర్‌పై అవినీతి ఆరోపణలు, ‘సైట్ విజిట్’ వివాదం నేపథ్యంలో సింగరేణి సంస్థ టెండర్‌ను రద్దుచేసింది. కేంద్ర బొగ్గు శాఖ జోక్యంతో అత్యవసర సమావేశం నిర్వహించగా, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామనియాజమాన్యం తెలిపింది.
Naini Coal Block Tender Cancelled Amid Controversy, SCCL Withdraws Bids
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లో బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌నువివాదాల నేపథ్యంలో రద్దు చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికారికంగాప్రకటించింది. అయితే, టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారాయి.
టెండర్ షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, అనూహ్యంగాదీనిని నిలిపివేశారు. ‘సైట్ విజిట్ తప్పనిసరి’ నిబంధనతో పాటు, కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలురూపొందించారన్న విమర్శలు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు నైనీ బ్లాక్ విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తూ, సిబిఐ విచారణకు డిమాండ్ చేసారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. దీన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హస్తముందంటూ ఆరోపణలు రావడం, మీడియా కూడా రాద్ధాంతం చేయడంతో సింగరేణికి వెనక్కితగ్గక తప్పిందికాదు.
కేంద్రం జోక్యం.. అత్యవసర సమావేశం
టెండర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుంది. నిబంధనలను రూపొందించే ముందుకేంద్రంతో ఎందుకు సంప్రదింపులు జరపలేదని జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలకు ఎందుకుఆస్కారం కల్పించారంటూ సింగరేణి యాజమాన్యాన్ని నిలదీశారు.
ఈ క్రమంలో కేంద్ర బొగ్గు శాఖా మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. టెండర్ ప్రక్రియపై పూర్తిస్థాయిపారదర్శకత అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా, రాష్ట్రంలో అవినీతికి తావు లేదంటూ ప్రభుత్వవైఖరిని వెల్లడించారు.
ఆలస్యం కానున్న గనుల ఉత్పత్తి

నైని కోల్ బ్లాక్ విషయంలో గతంలోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. 2016లోనూ టెండర్ ప్రక్రియ నిలిచిపోవడంతో గనులఅభివృద్ధి ఆలస్యమైంది. తాజా రద్దుతో మరోసారి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. బోర్డు సమావేశంలో నిబంధనలనుపునఃసమీక్షించిన తర్వాత, పూర్తిస్థాయి పారదర్శకతతో కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని యాజమాన్యం తెలిపింది.ప్రభుత్వ తదుపరి ఆదేశాల మేరకు ముందడుగు వేయనున్నట్లు వెల్లడించింది.
నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు వ్యవహారం తెలంగాణ రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పారదర్శకవిధానాలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తేనే వివాదాలకు ముగింపు పడే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram