Chinmayi | ప్రముఖ తమిళ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు లభించడంతో తమిళనాడులో పెద్ద చర్చ మొదలైంది. అకిలన్ (1975), జయకాంతన్ (2002) తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ తమిళ రచయితగా వైరముత్తు నిలిచారు. అయితే ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ సోషల్ మీడియాలో వైరముత్తును అభినందిస్తూ చేసిన పోస్టులు కొత్త వివాదానికి దారితీశాయి.
ప్రసిద్ధ గాయని చిన్మయి శ్రీపాద ఈ అభినందనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రజనీ, కమల్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. అయితే చిన్మయి కూడా తన అభిప్రాయాలను మరింత స్పష్టంగా వెల్లడిస్తూ వారికి కౌంటర్ ఇచ్చారు.
‘నా హీరోలు ఇలా ఉంటారని అనుకోలేదు’
మీటూ ఉద్యమ సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళల్లో చిన్మయి ఒకరు. ఈ నేపథ్యంలో వైరముత్తును రజనీకాంత్, కమల్ హాసన్ అభినందించడం ఆమెను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన చిన్మయి, “నేను కూడా రజనీ సర్, కమల్ సర్ అభిమానినే. వారు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటారని నమ్మాను. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అభినందించడం చూసి నిరాశ చెందే హక్కు నాకు ఉంది” అని పేర్కొన్నారు.
సినిమాల్లో మహిళల గౌరవం గురించి బలమైన సందేశాలు ఇచ్చే ప్రముఖులు, నిజ జీవితంలో మాత్రం వేధింపుల ఆరోపణలపై మౌనం పాటించడం ఎలా సరైనదని ఆమె ప్రశ్నించారు.
పరిశ్రమలో మహిళల భద్రతపై ప్రశ్నలు
తమిళ చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణ కోసం విశాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని చిన్మయి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పరిశ్రమలో ఇలాంటి వ్యవస్థలు లేకపోవడం మహిళలకు అన్యాయం చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏఆర్ రెహమాన్‌కు చెందిన కేఎమ్ కన్జర్వేటరీలో మాత్రమే ఐసీసీ వ్యవస్థ పనిచేస్తోందని, డబ్బింగ్ యూనియన్‌లో వేధింపులపై మాట్లాడిన మహిళను ఒక దశలో పని చేయకుండా నిషేధించారని కూడా ఆమె పేర్కొన్నారు.
రజనీ, కమల్‌పై ఘాటు వ్యాఖ్యలు
వైరముత్తును ‘ప్రియ మిత్రుడు’ అని సంబోధిస్తూ రజనీకాంత్ చేసిన ట్వీట్‌పై చిన్మయి ఎద్దేవా చేశారు. అలాగే కమల్ హాసన్ వైరముత్తును ‘కవి చక్రవర్తి’గా అభివర్ణించడంపై కూడా ఆమె స్పందించారు. రాజకీయాల్లో మహిళా రక్షణ గురించి మాట్లాడే నాయకులు ఇలాంటి ఆరోపణలను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె విమర్శించారు.
తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై కూడా చిన్మయి తీవ్రంగా స్పందించారు. నేరాలకు పాల్పడిన వారిని కాపాడే సంస్కృతి కొనసాగితే మహిళల భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇప్పటివరకు ఈ వివాదంపై రజనీకాంత్ లేదా కమల్ హాసన్ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో ఇంకా చర్చకు దారితీస్తోంది.
