Kamal Hassan | కమల్ హాసన్ పొదుపు సందేశం.. మాటల్లో కాదు, చేతల్లో చూపించిన విశ్వనాయకుడు ..‘కల్కి 2’ కోసం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం
Kamal Hassan |భారతీయ చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా నిర్మాణ వ్యయం పెరుగుదలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా కథ, సాంకేతిక నాణ్యత, విజువల్ ఎఫెక్ట్స్ కంటే నటీనటుల వ్యక్తిగత సౌకర్యాలు, లగ్జరీ ప్రయాణాలు, ప్రైవేట్ చార్టర్ విమానాలు వంటి అంశాలపైనే భారీగా ఖర్చు అవుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.
Kamal Hassan |భారతీయ చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా నిర్మాణ వ్యయం పెరుగుదలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా కథ, సాంకేతిక నాణ్యత, విజువల్ ఎఫెక్ట్స్ కంటే నటీనటుల వ్యక్తిగత సౌకర్యాలు, లగ్జరీ ప్రయాణాలు, ప్రైవేట్ చార్టర్ విమానాలు వంటి అంశాలపైనే భారీగా ఖర్చు అవుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
పరిశ్రమకు కమల్ హాసన్ పిలుపు
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం సినిమా పరిశ్రమపై కూడా పడుతోందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన బహిరంగ లేఖలో, సినిమా నిర్మాణానికి వెచ్చించే ప్రతి రూపాయి తెరపై కనిపించే అవుట్‌పుట్ కోసం ఉపయోగపడాలని ఆయన సూచించారు.
అదే సమయంలో చిత్ర పరిశ్రమలో పనిచేసే దినసరి కార్మికుల సంక్షేమం, వారి వేతనాలు, భోజన వసతులు, భద్రత వంటి అంశాల్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. సినీ రంగంలోని ప్రతి ఒక్కరూ ఖర్చుల విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోకి
చాలామంది ప్రముఖులు సలహాలు ఇస్తుంటారు. కానీ వాటిని స్వయంగా అమలు చేసే సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి. అయితే కమల్ హాసన్ మాత్రం తన మాటలను చేతల్లో చూపించారు.
‘కల్కి పార్ట్ 2’ తాజా షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఆయన ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించినట్లు సమాచారం. సాధారణంగా స్టార్ హీరోలు ప్రైవేట్ చార్టర్ విమానాలు లేదా బిజినెస్ క్లాస్ ప్రయాణాలను ఎంచుకునే పరిస్థితుల్లో కమల్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విలాసవంతమైన ప్రయాణాలను పక్కనబెట్టి సాధారణ ప్రయాణికుడిలా విమానంలో ప్రయాణించి నేరుగా షూటింగ్ సెట్స్‌కి చేరుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కమల్‌పై వైజయంతీ మూవీస్ ప్రశంసలు
ఈ విషయంపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా స్పందించింది. విమానంలో ప్రయాణిస్తున్న కమల్ హాసన్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆయన నిర్ణయాన్ని అభినందించింది. “పరిశ్రమ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో కమల్ హాసన్ ప్రైవేట్ చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదులుకుని ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం గొప్ప సందేశం. పరిశ్రమలో మార్పులకు ఇది ఒక ప్రారంభం కావచ్చు” అని పేర్కొంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు కమల్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
శరవేగంగా కొనసాగుతున్న ‘కల్కి పార్ట్ 2’
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కల్కి పార్ట్ 2’పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ వేగంగా కొనసాగుతోంది.
మొదటి భాగంలో క్లైమాక్స్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించిన కమల్ హాసన్, రెండో భాగంలో ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలో పూర్తి స్థాయిలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram