తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి..వసూళ్ల రికార్డులను సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు మూడో భాగం కూడా రానుందని ఆ సినిమా తారగణం ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు.ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చి రికార్డు విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీని స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి 3’ ఉంటుందని అధికారికంగా వెల్లడించారు. ‘ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అని ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రచారం కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని.. భవిష్యత్తులో పార్ట్ 3 తీస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు బాహుబలి పార్ట్ త్రీ అంశంపై నటీనటులు స్పష్టత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బాహుబలి మూడో భాగం పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్ కథనం. బాహుబలి రెండుభాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి మూడో భాగంతో దాన్ని తిరగరాడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్క నవ్వితే షూటింగ్ ఆగిపోతుంది..
నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఆ వీడియోలో ప్రభాస్, రాణా, అనుష్కలు పలు ఆసక్తికర ఫన్నీ అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అనుష్కకు సంబంధించి ప్రభాస్ మాట్లాడుతూ.. స్వీటీ నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుందని చెప్పారు. ఆమె రోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వకూడదు అనుకుంటూ వచ్చేదని.. నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని సరదాగా చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా తనకు ఓ ఎమోషనల్ జర్నీ అని ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సత్యరాజ్ మాట్లాడుతూ.. సెట్‌లో కాస్ట్యూమ్స్ చాలా ఉండేవని, ఎక్కడ చూసిన మొత్తం డ్రెస్‌లే ఉండేవని అదిచూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.