Bhaurampet Pollution | హైదరాబాద్ మహా నగరవాసులను కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. కాలుష్యం కోరల నుంచి తప్పించుకోవడానికి నగరవాసులు ఎక్కడికి వెళ్లినా వెంటాడుతునే ఉంది. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి శివారు ప్రాంతాలలో విల్లాలు, గేటేడ్ కమ్యూనిటీలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటున్న వారు… మానవ తప్పిదాలతో జరుగుతున్న వ్యవహారంతో కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ భారం నుంచి తమను కాపాడాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను, మరో వైపు పోలీస్ అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని దుందిగల్ మున్సిపాలిటి భౌరంపేట శివారులో ఉన్న త్రిపురా ల్యాండ్ మార్క్-3, ఆర్‌ఎన్‌జీ గేటేడ్ కమ్యూనిటీ విల్లాల వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పోలీస్ అధికారులు చొరవ తీసుకుని కాలుష్య భారం నుంచి 250 కుటుంబాలను కాపాడాలని వారు విన్నవించుకుంటున్నారు.
భౌరంపేట గ్రామ శివారులో ఓఆర్‌ఆర్‌కు సమీపంలో త్రిపుర ల్యాండ్ మార్క్ -3, ఆర్‌ఎన్‌జీ గేటేడ్ కమ్యూనిటీలో 250కి పైగా విల్లాలు నిర్మించారు. శివారు ప్రాంతంలో నిర్మించిన ఇక్కడ నివసించడం వల్ల కాలుష్య సమస్యకు దూరంగా, ప్రశాంతంగా జీవించవచ్చని చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. కానీ వాటి పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ స్థలంలో సంచార జాతుల వారి నివాసాల సమీపంలో ప్రతి రోజు గుట్టలు గుట్టలుగా పాత గుడ్డలు కాల్చి వేస్తుండడంతో వెలువడుతున్న పోగ (కాలుష్యం )తో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయంపై కాలనీ వాసులు ఇటు కాలుష్య నియంత్రణ మండలికి, అటు పోలీస్ అధికారులకు పిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాలుష్య నియంత్రణకు కట్టుబడాల్సిన అధికారులు నియంత్రించకుండా వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆర్‌ఎన్‌జీ కమ్యూనిటీ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో శ్రీ చైతన్య కాలేజీతో పాటు హస్టల్ నిర్వహిస్తున్నారు. వెయ్యి మంది విద్యార్థులు ఉండే అందులో వ్యర్థాల కోసం సీవరేజ్ ఫ్లాంట్ ఏర్పాటు చేసినప్పటికి దానిని వినియోగించకుండా వ్యర్థాలను బయటకు వదిలేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కాలుష్యం విషయంలో అధికారులు వెంటనే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
