Sridhar Babu on HILT Policy | భవిష్యత్తు తరాల కోసమే హిల్ట్‌.. వెనక్కు తగ్గేదే లేదు: పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొనే తాము హిల్ట్‌ పాలసీని తీసుకువస్తున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. దీనిపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలికి తరలిస్తామని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

  • By: TAAZ |    telangana |    Published on : Jan 06, 2026 9:40 PM IST
Sridhar Babu on HILT Policy | భవిష్యత్తు తరాల కోసమే హిల్ట్‌.. వెనక్కు తగ్గేదే లేదు: పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

విధాత, హైదరాబాద్:

Sridhar Babu on HILT Policy | మన పిల్లల కోసం.. రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం తాము హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (హిల్ట్) పాలసీ పేరిట ఒక మార్పు వైపు మొదటి అడుగు వేశామని పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు తెలిపారు. అయినా సరే… కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. చాలా మంది దీనిని కేవలం ఒక సాదాసీదా భూ మార్పిడిగా మాత్రమే చూస్తున్నారని చెప్పారు. భూమి వినియోగం మారుతోందని, పారిశ్రామిక ప్రాంతం కాస్తా నివాస ప్రాంతంగా మారుతోందని కేవలం రెవెన్యూ రికార్డుల కోణంలో మాత్రమే చూస్తున్నారు. ‘కానీ నేను ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. ఇది కేవలం భూ వినియోగ మార్పిడి కాదు, ఇది మన పిల్లల కోసం… రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది’ అని శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫార్మేషన్(హిల్ట్) పై మంగళవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడం కాదు… మా ఉద్దేశం పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి మన పిల్లలకు… రేపటి తరాలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే తమ సంకల్పమన్నారు. ‘1970వ దశకంలో ఐడీపీఎల్ రాకతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం మొదలయ్యింది. ఆనాడు బాలానగర్, సనత్ నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి వంటి ప్రాంతాలను కేవలం పరిశ్రమల కోసమే “ప్రత్యేక జోన్లు”గా కేటాయించారు. అప్పట్లో ఇవి నగరం చివరి ప్రాంతాల్లో ఉండేవి. కానీ.. ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది? హైదరాబాద్ నగరం మనం ఊహించని విధంగా విస్తరించింది. ఒకప్పుడు ఎక్కడో బయట ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు, నేడు నగరానికి “నడిబొడ్డు” గా మారిపోయాయి. ఓవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు. ఈ రెండింటి మధ్య ‘బఫర్ జోన్’ అంటూ లేకుండా పోయింది’ అని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘నగరంలోని చాలా ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ‘హెవీ మెటల్స్’ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే వేయి శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ‘హైదరాబాద్’ కూడా ఢిల్లీలా మారడం ఖాయం’ అని చెప్పారు. ఇక్కడున్న సభ్యులు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించాలని శ్రీధర్ బాబు కోరారు.

తెలంగాణ ప్రభుత్వ నూతన విధానం ప్రకారం.. నగరం నుంచి బయటకు తరలించే పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఓఆర్ఆర్ అవతల కల్పిస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. నిర్భయంగా మీరు వెళ్లొచ్చని, మీ సమస్యలను పరిష్కరించేందుకు… మీతో చర్చించేందుకు… మీ సందేహాలను నివృత్తి చేసేందుకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యానికి ప్రజలు తమ ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తున్నారు. ఈ అసమతుల్యతను తొలగించడమే హిల్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ‘కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి క్లీన్ ఎన్విరాన్ మెంట్ ను అందించడం. మన పిల్లలకు… రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీటిని అందించడం. దీనిపై అవగాహన లేకుండానే కొందరు కావాలని పనిగట్టుకుని ‘పాలసీ’ బయటకు రాక ముందే మాపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులైతే ప్రభుత్వం భూములను తక్కువ ధరకే మేం అమ్మేస్తున్నామంటూ మాపై బురద చల్లడం ప్రారంభించారు. లీజ్ ల్యాండ్స్ (ప్రభుత్వానికి పూర్తిస్థాయి హక్కులు కలిగిన భూములు… లీజ్ వ్యవధి 99 ఏళ్లు మాత్రమే)పై ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ను కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 29-08-2023న జీఓఎంస్ 19ను తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులను కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ జీఓ వెనుక మతలబు ఏంటి…? దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లడటం లేదు. అంతకు ముందే ‘గ్రిడ్’ పాలసీ (10-12-2020) పేరిట సర్కార్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. మరి ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడికెళ్లారు..? మీ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తానా ఏంటి..?’ అని శ్రీధర్ బాబు నిలదీశారు.
హిల్ట్ పాలసీ విషయంలో మీరెన్ని విమర్శలు చేసిన మేం వెనక్కి తగ్గేది లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పలు ఇండస్ట్రియల్ ఏరియాలలో ఖాయిలా పడ్డ పరిశ్రమలు, మూతపడిన పరిశ్రమల వల్ల ఆ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలా వృథాగా మారిన స్థలాలను పునర్వియోగంలోకి తేవడమే లక్ష్యం. కొన్ని పరిశ్రమలు ఇంకా కాలం చెల్లిన టెక్నాలజీనే వినియోగిస్తుండడంతో పరిసరాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతోనే ఈ పాలసీని రూపొందించామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.