HILT policy leak| జీవోకు ముందే విపక్షాల చేతికి హిల్ట్ పాలసీ..లీక్ పై విజిలెన్స్ విచారణ!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారంపై ప్రభుత్వం శాఖపరంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పాలనపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి పట్టు చిక్కడం లేదన్న విమర్శలు తరుచూ వినవస్తున్నాయి. ఇందుకు ఊతమిచ్చేలా తరుచుగా పలు ప్రభుత్వ శాఖల నుంచి అధికారిక ఉత్తర్వులకు ముందే సమాచారం బయటకు పొక్కుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం తెచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT Policy) పాలసీ విషయంలోనూ ప్రభుత్వ జీవో విడుదలకు ముందే పాలసీ సమాచారం ప్రతిపక్షాల చేతికి అందడం ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. పరిశ్రమల శాఖలో జీవో వెలువడక ముందే హిల్ట్ పాలసీని లీక్(HILT policy leak) చేసిందెవరన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుంది.
హిల్ట్ లీక్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
తాజాగా హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారంపై ప్రభుత్వం శాఖపరంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ దశలోనే సమాచారం లీక్ కావడం ప్రభుత్వ వర్గాలను విస్మయ పరిచింది. అంతర్గతంగా ఏం జరిగింది? లీక్ వీరులు ఎవరు? అన్న దానిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే బయటికి లీకవ్వడం ప్రభుత్వానికి షాక్ గురి చేసింది. హిల్ట్ పాలసీ జీవో 22న విడులైతే..అంతకుముందే నవంబర్ 20న పాలసీ ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. .జీవో విడుదలకు ముందే సమాచారం ఎవరు లీక్ చేశారో తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గమనార్హం.
హిల్ట్ పాలసీ భారీ స్కామ్ అంటున్న ప్రతిపక్షాలు
కొత్త హిల్ట్ పాలసీ కింద పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు వాటిని వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం రూ.లక్షల కోట్ల విలువైన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు.. నామమాత్రపు ధరకే ఈ విధానం క్రమబద్ధీకరిస్తుంది. ఈ ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న 22 పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లలోని 9,292 ఎకరాల భూములను.. మల్టీ-యూజ్ జోన్లుగా మార్చాలని ప్లాన్ చేసింది. హిల్ట్ పాలసీతో ప్రభుత్వ ఖజానాకు రూ.5లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందని..ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అటు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
మరో ప్రతిపక్షం బీజేపీ సైతం దీనిలో రూ.6.29 లక్షల కోట్ల భూముల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ వేసిందని ఆరోపిస్తుంది. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు సైతం చేసింది. ఈ పాలసీని రద్దు చేయాలనీ, దీనిపై చర్చకు స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయించాలని బీఆర్ఎస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. తమ పార్టీలు అధికారంలోకి వస్తే మొత్తం పాలసీని రద్దు చేస్తామని ప్రకటించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram