HILT Policy Controversy | రెండేళ్లుగా రేవంత్ సర్కార్‌లో లీకు వీరుల హవా.. హిల్ట్ పాలసీ లీక్ తో దుమారం!

తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ. కానీ.. ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందే ప్రతిపక్షం చెవికి చేరిపోతున్నాయి. తాజాగా హిల్ట్‌ పాలసీ లీక్‌ కావడం ప్రభుత్వంలో బీఆరెస్‌ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలను అధికార పార్టీలో రేకెత్తిస్తున్నది.

HILT Policy Controversy | రెండేళ్లుగా రేవంత్ సర్కార్‌లో లీకు వీరుల హవా.. హిల్ట్ పాలసీ లీక్ తో దుమారం!

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

HILT Policy Controversy | కాంగ్రెస్ సర్కార్ అంటేనే అంతులేని స్వేచ్ఛ ఉంటుందని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకొంటూ ఉంటారు. ఎవరు ఏదైనా చేయవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. పరిమితి లేని స్వేచ్ఛ కారణంగానే కీలకమైన నిర్ణయాలు, మంత్రివర్గంలో చర్చించిన అంశాలు ప్రజల కన్నా ముందే బీఆర్ఎస్ ముఖ్య నాయకుల చెవుల్లోకి వెళ్తున్నాయి. గోడలకు చెవులు ఉన్నాయనే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతోందంటున్నారు. తాజాగా హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌) పాలసీపై మంత్రివర్గ సభ్యుల కన్నా ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియడం, ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారని సమాచారం. మంత్రివర్గంలో చర్చకు రాక మునుపే బీఆర్ఎస్ నేతకు చేరడంతో ఆగ్రహం చెందిన రేవంత్ రెడ్డి దీనిపై అంతు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోనే కోవర్టులు ఉన్నారంటూ విజిలెన్స్ వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సమర్పించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

హిల్ట్ పాలసీపై కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద దుమారం నడుస్తోంది. రూ.5 లక్షల కోట్ల దోపిడి అంటూ బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి అతి పెద్ద అవినీతికి తెరలేపారని ఆరోపణలు చేస్తున్నారు. హిల్ట్ పాలసీ ముసాయిదా లీకు కావడం పై తొలుత పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ ఉన్నతాధికారులను అనుమానించారు. ఉన్నతాధికారుల్లో ఎవరో ఒకరు ఈ నిర్వాకానికి ఒడిగట్టారని, ముసాయిదా ప్రతిని హార్డ్ కాపీ రూపంలో పంపించారని అంచనాకు వచ్చారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నవారు ఎవరు, వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ తరువాత మంత్రివర్గంలోనే ఒక సీనియర్ మంత్రి హిల్ట్ పాలసీ వివరాలను ప్రతిపక్షాలకు ఇచ్చారనే వాదనలు మొదలయ్యాయి. ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు వివరాలు అందచేసి వస్తున్నారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆయన తీరు పట్ల ముఖ్యమంత్రి కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారంటున్నారు.

తాజాగా మరొకరి పేరు తెర మీదికి వచ్చింది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే ప్రతి సమావేశం, సభలకు వెళ్లిన వ్యక్తి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఆయన వైఖరి సరిగా లేకపోవడం, వసూళ్లకు పాల్పడడంతో పదవి నుంచి తప్పించి మరో రాజ్యాంగబద్ధమైన నామినేటెడ్ పదవి ఇచ్చి సాగనంపారు. తనను అవమానానికి గురి చేశారనే ఆగ్రహంతో ఉన్న ఆయన ప్రభుత్వంలో జరిగే ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు చేరవేస్తున్నారనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఆయనకు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నారంటున్నారు. హిల్ట్ పాలసీ విషయం తెలియడంతో వెంటనే ముసాయిదా ప్రతిని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారని, వెంటనే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడం జరిగిందని చర్చ నడుస్తోంది.

హిల్ట్ లీకు చేసింది తెలంగాణ బిడ్డే…

హిల్ట్ పాలసీ బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గింగిరాలు పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే వివేక్ తో కలిసి కేటీఆర్ కుత్బుల్లాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీ దోపిడి ఆపడానికి, నిజాయితీ గల తెలంగాణ బిడ్డ, గుండె ధైర్యం ఉన్నోడు బయటకు చెప్పాడని, ఇందులో తప్పేముందని కేటీఆర్ ప్రశ్నించారు. నీవు దోపిడి చేస్తుంటే.. అడ్డుకుంటే నొచ్చినాది అని అడిగారు. ఎందుకు దోపిడి చేస్తున్నావో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశం పెడితే అన్నీ మాట్లాడతామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడతామని, ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also |

Dirtiest City 2025 | ప్రపంచంలోనే అత్యంత డర్టీ సిటీ బుడాపెస్ట్‌? లిస్టులో హైదరాబాద్‌!
Amaravati : అమరావతి రాజధానికి చట్టబద్దత
Zero Click Search Impact | జీరో క్లిక్‌ ఎఫెక్ట్‌.. వెబ్‌సైట్‌లు, కంటెంట్‌ పబ్లిషర్స్‌ బొండిగ పిసుకుతున్న ఏఐ ఓవర్‌వ్యూ!
Jaldapara | ఈస్ట్ వీరప్పన్‌.. కరుడుగట్టిన వేటగాడి కథ తెలుసా?