Dirtiest City 2025 | ప్రపంచంలోనే అత్యంత డర్టీ సిటీ బుడాపెస్ట్‌? లిస్టులో హైదరాబాద్‌!

ప్రపంచంలోనే అత్యంత మురికి నగరంగా బుడాపెస్ట్‌ను ర్యాంక్‌ చేస్తూ వచ్చిన స్టడీ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ జాబితాలో హైదరాబాద్‌ను కూడా చేర్చారు.

Dirtiest City 2025 | ప్రపంచంలోనే అత్యంత డర్టీ సిటీ బుడాపెస్ట్‌? లిస్టులో హైదరాబాద్‌!

Dirtiest City 2025 | ప్రపంచంలోనే అత్యంత మురికి నగరం బుడాపెస్ట్‌ అంటూ రాడికల్‌ స్టోరేజ్‌ 2025 రిపోర్టు వెల్లడించడం నెట్టింట పెను దుమారాన్ని రేపింది. 2024 అక్టోబర్‌ నుంచి 2025 నవంబర్‌ వరకూ గూగుల్‌ రివ్యూస్‌లో అపరిశుభ్రతపై 37.0 శాతం ప్రస్తావనల ఆధారంగా రాడికల్‌ స్టోరేజ్‌ ఈ ర్యాంకింగ్‌ ఇచ్చింది. మొత్తం 100 టాప్‌ టూరిస్ట్‌ ప్రదేశాల పరిశుభ్రతను ఈ స్టడీ అంచనా వేసింది. గాలి నాణ్యత, చెత్తను నిర్వహించే తీరుపై పర్యాటకుల అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ధారణలకు వచ్చింది.

టాప్‌ 20 నగరాల జాబితా ఇలా ఉంది..
1. బుడాపెస్ట్, హంగేరీ
2. రోమ్, ఇటలీ
3. లాస్ వెగాస్, అమెరికా
4. ఫ్లోరెన్స్, ఇటలీ
5. పారిస్, ఫ్రాన్స్
6. మిలన్, ఇటలీ
7. వెరోనా, ఇటలీ
8. ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ
9. బ్రస్సెల్స్, బెల్జియం
10. కైరో, ఈజిప్ట్
11. హెరాక్లియోన్, గ్రీస్
12. న్యూయార్క్ సిటీ, అమెరికా
13. బార్సిలోనా, స్పెయిన్
14. జోహోర్ బహ్రు, మలేషియా
15. సెవిల్లె, స్పెయిన్
16. శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా
17. మయామి, అమెరికా
18. హైదరాబాద్, ఇండియా
19. లండన్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
20. ఒసాకా, జపాన్

ఎక్స్‌లో ఈ పోస్ట్‌కు 2.3 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అనేక మంది యూజర్లు బుడాపెస్ట్‌లో చిన్న చెత్త కూడా లేని ప్రాంతాల ఫొటోలతో కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. ఎవరో కొంతమంది పర్యాటకులు చేసిన కామెంట్ల ఆధారంగా ర్యాంకులు ఇవ్వడమేంటని మండిపడ్డారు.

బహుశా మీరెప్పుడూ బుడాపెస్ట్‌ లేదా ఫ్లారెన్స్‌ను సందర్శించలేదేమోనని ఒక యూజర్‌ ఎద్దేవా చేశారు. ఈ లిస్ట్‌ పెద్ద జోక్ అని తేల్చిపారేశారు. ఇప్పటి వరకూ మీరు ప్రచురించిన అత్యంత వరస్ట్‌ లిస్ట్‌ ఇదేనని, పూర్తిగా అబద్ధాల కుప్ప అంటూ నిప్పులు చెరిగారు. తాను యూరప్‌ చూడలేదు కానీ.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లోని నగరాలు, భారత్‌లోని ఇతర నగరాల పరిస్థితి ఏంటని మరొక యూజర్‌ స్పందించారు. జపాన్‌ ఈ లిస్టులో ఉండటం పెద్ద జోక్‌ అని ఒకరు పేర్కొన్నారు. వాస్తవానికి నైజీరియాలోని లాగోస్‌ నగరాన్ని లిస్టులో టాప్‌లో ఉంచాల్సిందని ఒకరు అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో అత్యంత పరిశుభ్రమైన నగరం ఇదిగో.. అంటూ చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్న ఢాకా నగర వీధి ఫొటోను ఒకరు సెటైరిక్‌గా షేర్‌ చేశారు.