India’s New Income Tax Bill : ఏప్రిల్ 1 నుంచి సోషల్ మీడియా, ఈ మెయిల్, డిజిటల్ ఖాతాల తనిఖీలు

వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉందా? మీ ఈ-మెయిల్స్, డిజిటల్ ఖాతాలను తనిఖీ చేసే అధికారం ఐటీ అధికారులకు దక్కనుంది.

India’s New Income Tax Bill : ఏప్రిల్ 1 నుంచి సోషల్ మీడియా, ఈ మెయిల్, డిజిటల్ ఖాతాల తనిఖీలు

సంపన్నుల నుంచి వారసత్వ పన్నులు వసూలు చేయాలని, అమెరికా దేశంలో ఈ విధానం అమలులో ఉందని కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా చేసిన సూచనపై బీజేపీ నాయకులు గగ్గోలు చేశారు. కాంగ్రెస్ నాయకులు మీ ఆస్తులు గుంజుకుని ముస్లిం మైనారిటీలకు పంచిపెడతారని బీజేపీ నేతలు బదనాం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పన్ను ఎగవేతదారుల పేరుతో ప్రజల వ్యక్తిగత గోప్యత (పర్సనల్ ప్రైవసీ) కు భంగం కలిగించే చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అనగా ఏప్రిల్ 1వ తేదీ 2026 నుంచి దేశ పౌరులకు సంబంధించిన ఈ మెయిళ్లను పరిశీలించనున్నది. సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం పర్యవేక్షించనున్నది. డిజిటల్ ఖాతాలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకని ఎవరైనా నిలదీసినా, ప్రతిపక్షాలు ప్రశ్నించినట్లయితే ఒకటే సమాధానం ఇస్తారు. పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకేనని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు బీజేపీ పాలకులు.

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాదారుల విషయంలో వెట్టింగ్ విధానం అమలు పరుస్తున్నది. వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలు, ఈ మేయిళ్ళను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నది. ప్రతి వీసాదారుడి నుంచి ఆన్ లైన్ క్రిడెన్షియల్స్ ను తీసుకుంటున్నది. అదే తరహాలో కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నది. ఆదాయపు పన్నులు చెల్లించేవారితో పాటు చెల్లించని వారి పై నిఘా పెంచనున్నది. దేశంలో జనాభా 140 కోట్ల వరకు ఉండగా అందులో 2024 సంవత్సరం నాటికి 8.62 కోట్ల మంది చెల్లింపుదారులు ఉన్నారు. ఈ సంఖ్యలో మహిళా చెల్లింపు దారుల సంఖ్య 15 శాతం వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ పన్ను వసూళ్లను అధిగమించాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.24 లక్షల కోల ఆదాయపు పన్ను ద్వారా సమకూరే అవకాశముంది. దేశంలో కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16 లక్షలకు పైగా ఉంది. నిర్ధిష్ట ఆదాయం దాటిన వారు పన్నుల శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని అధిక ఆదాయం సంపాదిస్తున్న కొందరు తప్పించుకునేందుకు ఆడిటర్లను మచ్చిక చేసుకుంటన్నారు. కొందరు వాస్తవ ఆదాయం కన్నా తక్కవ మొత్తం చూపించడం, తప్పుడు ఐటీ రిటర్నులను దాఖలు చేయడం, ఆదాయ వనరులను వెల్లడించకపోవడం పరిపాటుగా మారాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎగవేతదారులను గుర్తించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నది. గత మూడు సంవత్సరాలుగా పలు సర్వేలు నిర్వహించి, పటిష్ట నిఘా పెంచారు. అయినప్పటికీ దారిలోకి రాకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తున్నది. ఆదాయపు పన్ను చట్టం 2025 లో 23 ఛాప్టర్లు, 536 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. గతంలో మాదిరి గజిబిజీ ఛాఫ్టర్లు, సెక్షన్లు తొలగించారు. ఐటీ అధికారులకు విస్తృత అధికారాలు కల్పించి బాహుబలిని చేశారు. ఇప్పటి వరకు మనం ఐటీ అధికారుల టీమ్ ఒక కంపెనీ యజమాని లేదా ఎగవేతదారుడి ఇంటికి వెళ్ళి సెర్చ్ చేశారని విన్నాం. ఆయన కార్యాలయం తో పాటు ఇంటిని తనిఖీలు చేసి బ్యాంకులకు వెళ్లి ఖాతా వివరాలు, లాకర్ల లో ఏముందనేది ఆరా తీసేవారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటితో పాటు అనుమానం వచ్చిన వెంటనే ఈ మెయిళ్లను ఆసాంతం తనిఖీ చేస్తారు. బడా కంపెనీల క్లౌడ్ సర్వర్లను పరిశీలిస్తారు. సోషల్ మీడియా ఖాతాల క్రిడెన్షియల్స్ తీసుకుంటారు. వెబ్ సైట్ల లోకి చొరబడి తమకు కావాల్సిన వివరాలు డౌన్ లోడ్ చేసుకుంటారు. ఈ సమాచారం నాది కాదు, ఈ నగదు లావాదేవీలు నేను చేయలేదు, ఈ బంగారం మా ఆవిడది, ఆ ఫ్లాట్ మా మామ కట్నం కింద ఇచ్చారు అని బుకాయించడానికి అవకాశం ఉండదు. మీ వ్యక్తిగత గోప్యత లోకి ప్రవేశించడం మూలంగా ఏ విషయం కూడా గతంలో మాదిరి దాచడానికి ఏమాత్రం అవకాశం లేదు. పాన్ ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం మూలంగా, పాన్ నెంబర్ ను ఐటీ వెబ్ ఫోర్టల్ లో నమోదు చేయగానే పూర్తి వివరాలు 360 డిగ్రీలలో కన్పిస్తున్నాయి. ఏ లావాదేవీలు చేశారు, ఎన్ని బ్యాంకులలో ఖాతాలు ఉన్నాయి, ఎంత మొత్తం వడ్డీ సమకూరింది అనే వివరాలు స్పష్టంగా వెల్లడి అవుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే డిజిటల్ ఖాతాల తనిఖీ దీనికి అదనంగా, ఆయుధంగా మారనున్నది. అంటే ఏ ఒక్కరు కూడా తాము ప్రత్యేకం అని చెప్పుకోవడానికి లేదు. అందరి జుట్లు కేంద్రంలోని ఆదాయపు పన్ను శాఖ పరిధిలో ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

Bhagyashri Borse | కలర్‌ఫుల్ లెహంగాలో మెరిసిపోతున్న భాగ్యశ్రీ బొర్స్.. ఫొటోలు వైరల్!
Jeddah Tower : బూర్జు ఖలిఫా ను మించి జెడ్డా టవర్