Inhalable Microplastics | మీరు పీల్చుతున్నది గాలి మాత్రమే కాదు.. తాజా అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు!

రోడ్డు మీదనిలబడి.. మనం ఊపిరి తీసుకుంటే గాలి మాత్రమే మన ఊపిరితిత్తుల్లోకి వెళుతుందని భావించేవారు ఉంటారు. కొంత చైతన్యం కలిగి ఉంటే.. కాలుష్యభరిత వాయువులు పీల్చుతున్నామని అర్థమవుతుంది. కానీ.. మన శరీరంలోకి ఏకంగా మైక్రోప్లాస్టిక్‌ కణాలు వెళుతున్నాయన్న విషయం తెలుసా? దీనిపైనే తాజా అధ్యయనం కీలక అంశాలు వెల్లడించింది.

  • By: TAAZ |    national |    Published on : Jan 12, 2026 6:42 PM IST
Inhalable Microplastics | మీరు పీల్చుతున్నది గాలి మాత్రమే కాదు.. తాజా అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు!
  • మానవాళికి కొత్త ముప్పు.. ఇన్‌హేలబుల్‌ మైక్రోప్లాస్టిక్స్‌
  • మన చుట్టూ ఉన్న గాలి మొత్తం కాలుష్యభరితమే
  • నాలుగు నగరాలపై అధ్యయనంలో కీలక అంశాల వెల్లడి

రోజూ మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఆ ఊపిరిలో గాలి.. మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. మన మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. కానీ.. మనం నిజంగా ఒక్క గాలినే పీల్చుతున్నామా? ఏదో మార్కెట్‌లో లేదా రోడ్డు మీద, బస్టాప్‌లో, షాపింగ్‌మాల్‌లో ఉన్నప్పుడు మన చుట్టూ గాలి ఉందనే అనుకుంటాం. కానీ.. శాస్త్రవేత్తలు మాత్రం ఒక షాకింగ్‌ నిజాన్ని చెబుతున్నారు. అదేంటంటే మన ఊపిరితోపాటు.. ప్రతి రోజూ మన ఊపిరిలో పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలు కూడా పీల్చుకోవాల్సి వస్తున్నది. దేశంలో నానాటికి పెరిగిపోతున్న వాయుకాలుష్యం తీవ్రతకు ఈ అధ్యయనం నిదర్శనంగా నిలుస్తున్నది.

భారతదేశంలో సగటు నగరవాసి తన జీవితకాలంలో దాదాపు మూడు గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ కణాలను పీల్చుతున్నాడట. అంటే.. ఓ చిన్నసైజు ప్లాస్టిక్‌ బాటిల్‌ బరువంత మైక్రోప్లాస్టిక్‌ మన ఊపిరితిత్తుల్లో చేరుతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటున్నది. ఈ అధ్యయనాన్ని కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (IISER), ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS), కల్యాణికి చెందిన ఇన్‌స్ట్యిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌–చెన్నై, ముంబైకి చెందిన హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా నిర్వహించాయి.

మనం పీల్చుతున్న మైక్రోప్లాస్టిక్స్‌ సాధారణమైనవి కావని, ఇవి నాశికా రంథ్రాల నుంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోగల Inhalable Microplastics (iMPs) అని అధ్యయనం పేర్కొన్నది. ఇవి పీఎం2.5 కన్నా చాలా చిన్నవి. ఒకసారి ఇవికనుక ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే.. కొన్ని రక్తనాళాల్లోకి, మరికొన్ని హృదయం నుంచి ఏకంగా మెదడు వరకూ వెళ్లిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు హెచ్చరించారు.

ఈ అధ్యయనాన్ని ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాల్లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లు, రహదారులపై సేకరించిన వాయు నమూనాల ఆధారంగా నిర్వహించారు. ఇన్‌హేలబుల్‌ మైక్రోప్లాస్టిక్స్‌ (iMPs) కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో అత్యధికంగా, చెన్నై, ముంబై (సముద్ర గాలుల వల్ల) తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

మనం రోజువారీ జీవితంలో వాడే సింథటిక్‌ వస్త్రాలు, వాహనాల టైర్లు, మనం తొడుక్కొనే చెప్పులు, ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఇవి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

డబుల్‌ డేంజర్‌

మైక్రోప్లాస్టిక్‌ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లటం ఒక డేంజర్‌ అయితే.. వాటి మీద బ్యాక్టీరియా, వైరస్‌, హానికారక రసాయనాలు అంటుకొని ఉండటం ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నదని అధ్యయనకారులు తెలిపారు. మొత్తంగా క్యాన్సర్‌కు కారణమయ్యే కొన్ని రసాయనాలు, మనిషిలోని హార్మోన్ల సమతుల్యాన్ని దెబ్బతీసే కెమికల్స్‌, న్యూరోటాక్సిక్‌ పదార్థాలు.. యాంటిబయాటిక్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా.. ఇలా మన ఊపిరి ద్వారా మనం ఒక ‘విషపు కాక్‌టెయిల్‌’లోనికి పంపిస్తున్నామన్నమాట.

మైక్రోప్లాస్టిక్స్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లాక కొంత భాగం మన రక్తనాళాల్లోకి చేరుతుందని, అది శరీరం మొత్తం పాకి.. భవిష్యత్తుల్లో క్యాన్సర్‌లు, హృద్రోగాలు, నరాల సంబంధ సమస్యలకు దారి తీయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో ప్రపంచం మూడు దఫాలుగా అతి తీవ్ర కరోనా పరిస్థితులను ఎదుర్కొన్నది. మనిషి పీల్చి వదిలిన గాలి.. ఎదుటి వ్యక్తికి కరోనాను అంటించిన దారుణ పరిస్థితులను చూశాం. ఇప్పుడు ఈ మైక్రోప్లాస్టిక్‌ కణాలు కూడా కరోనా లాంటి ప్రమాదాలను సృష్టించే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే.. ఈ మైక్రోప్లాస్టిక్‌ కణాలపై ఉన్న బాక్టీరియా మనం ఊపిరి పీల్చినప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. నిశ్వాసతో మళ్లీ బయటకు వస్తుంది. అటువంటి సమయాల్లో అది వేరే వ్యక్తికి సోకే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

పరిష్కారాలేంటి?

వాయుకాలుష్య నియంత్రణ, అందుకు అవసరమైన పర్యావరణ హిత విధానాలు రూపొందించడం, అమలు చేయడం పూర్తిగా ప్రభుత్వాలు చేయాల్సిన పనే. కానీ.. వ్యక్తిగతం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజమైన ఫైబర్‌ దుస్తులను ఎంచుకోవాలని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో సింథటిక్‌ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ బాగా పెరిగిపోయింది. ఇటువంటి సింథటిక్‌ వస్త్రాలు తగ్గించుకుంటే.. అవి మనం ఉపయోగించిన తర్వాత చెత్తలోకి వెళ్లి.. కాలుష్య కాణాలకు కారణమయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. వీలైనంత వరకూ ప్లాస్టిక్‌ చెత్త కాల్చకుండా జాగ్రత్త పడాలి. మార్కెట్‌లలో గాలి బాగా వచ్చే అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. ప్రజా రవాణాను ఉద్యమ స్థాయిలో ప్రోత్సహించాలి.
ఇన్‌హేలబుల్‌ మైక్రోప్లాస్టిక్‌ను అధికారికంగా కొత్త వాయుకాలుష్య కారకంగా ప్రభుత్వాలు గుర్తించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాదు.. లేదు.. అంటే మనం మన ఊపిరితోపాటు.. ఐదారు గ్రాముల ప్లాస్టిక్‌ను కూడా మన జీవితకాలంలో మన ఊపిరితిత్తుల్లో దాచుకోక తప్పదు!!

Read Also |

Vande Bharat Sleeper | నో వీఐపీ కోటా, నో ట్రావెల్‌ పాస్‌.. తొలి వందే భారత్‌ స్లీపర్‌ సాధారణ ప్రజల కోసమే..!
Kushi Kapoor | జాన్వీ క‌పూర్ సోద‌రి అలాంటి వ్యాధితో బాధ‌ప‌డుతుందా.. న‌య‌నం కాని ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు ఏంటి?
‘మన శంకర వరప్రసాద్ గారు’ రివ్యూ – సంక్రాంతికి చిరు అందించిన కుటుంబ వినోదం