Vande Bharat Sleeper | నో వీఐపీ కోటా, నో ట్రావెల్ పాస్.. తొలి వందే భారత్ స్లీపర్ సాధారణ ప్రజల కోసమే..!
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ (Vande Bharat) రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు రైల్వేశాఖ స్లీపర్ వర్షెన్ (Vande Bharat Sleeper)ను అందుబాటులోకి తెస్తోంది. ఈ రైళ్లు ఈ నెలలోనే పట్టాలెక్కబోతున్నాయి.
Vande Bharat Sleeper | జనవరి చివర్లో గువాహటి-కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు కేవలం సామాన్య ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందులో వీఐపీ కోటా ఉండదట. అంతేకాదు అత్యవసర కోటాలకు కూడా అనుమతి ఉండదు. రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు కూడా సాధారణ ప్రయాణికుల్లానే ఇందులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రావెల్ పాస్‌లను అనుమతించరు. ఈ రైలులో ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్లను (Confirmed Tickets) మాత్రమే జారీ చేస్తారు. దీని వల్ల వెయిటింగ్ లిస్ట్ సమస్య గణనీయంగా తగ్గుతుంది.
విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి..
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి ఉంటుంది. ఎందుకంటే, విమానం తరహాలో ప్రయాణికులకు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. విమాన సిబ్బంది తరహాలోనే స్లీపర్ రైలులోని ప్రతీ సిబ్బంది యూనిఫాం ధరిస్తారు. ఈ రైలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. అందులో థర్డ్ ఏసీ కోచ్‌లో 611, సెకండ్ ఏసీ కోచ్‌లో 188, ఫస్ట్ ఏసీ కోచ్‌లో 24 ఉంటాయి. రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది.
సేఫ్టీ ఫీచర్స్..
రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు వంటివి ప్రయాణికులను ఆకర్షించనున్నాయి.
టాయిలెట్‌లో ఎలాంటి బటన్ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ సైతం ఉంటుంది. ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. అలాగే, బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్‌లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 మధ్య ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram