Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ : కళ్లుచెదిరే సౌకర్యాలు, వేగం @ 180 కిమీ
కోటా–నాగ్దా మార్గంలో 180 కిమీ వేగ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన వందే భారత్ స్లీపర్ రైలు, యూరోపియన్ డిజైన్, విమాన స్థాయి సౌకర్యాలు, కవచ్ భద్రతా వ్యవస్థలతో భారత రైల్వే దూర ప్రయాణాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.
Vande Bharat Sleeper Train Redefines Overnight Travel with European Design and Aircraft-Level Comfort
సారాంశం:
యూరోపియన్ డిజైన్ ఆధారంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు, విమాన స్థాయి సౌకర్యాలతో రాత్రి ప్రయాణానికి కొత్త అర్థాన్ని ఇస్తోంది. 180 కిమీ వేగ పరీక్షల్లో విజయాన్ని సాధించిన ఈ రైలు, కుషన్ బెర్త్‌లు, నైట్ లైటింగ్, బయో-వాక్యూమ్ టాయిలెట్లతో విశ్రాంతి, భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాత్రి రైలు ప్రయాణానికి కొత్త ప్రమాణాలు ఏర్పరుస్తోంది.
- రాత్రి రైలు ప్రయాణంలో కొత్త శకం
- విమాన ప్రయాణంలా అనుభూతి
- విలాసవంతమైన అత్యాధునిక సౌకర్యాలు
- గంటకు 180 కిమీ వేగంతో దూసుకెళ్తుంది
విధాత నేషనల్ డెస్క్ | హైదరాబాద్:
Vande Bharat Sleeper | భారత రైల్వే చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయోగ పరీక్షల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని విజయవంతంగా సాధించింది. కోటా–నాగ్దా రైలు మార్గంలో నిర్వహించిన ఈ స్పీడ్ ట్రయల్స్‌ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్యవేక్షించారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పరీక్షల వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “వందే భారత్ స్లీపర్ 180 కిమీ వేగంతో పరీక్షలు పూర్తి చేసింది. రైలు లోపల నిర్వహించిన ‘వాటర్ టెస్ట్’ ఈ కొత్త తరం రైలు సాంకేతిక స్థాయిని నిరూపించింది” అని తెలిపారు.
రైలు లోపల గ్లాసుల్లో నీరు ఉంచి నిర్వహించిన ఈ పరీక్షలో, అత్యధిక వేగంలో కూడా ఒక్క నీటి చుక్క కూడా చిందకపోవడం రైలు స్థిరత్వం, ఇంజినీరింగ్ అద్భుతాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది. ఒక్క కుదుపు కూడా లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఇది సాధారణ వేగ పరీక్ష మాత్రమే కాకుండా, ప్రయాణికుల సౌకర్యం–భద్రతలకు ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనంగా రైల్వే అధికారులు చెబుతున్నారు.
యూరోపియన్ శైలి, విమాన ప్రయాణ అనుభూతి – ఈ రైలు ప్రత్యేకత
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
వందే భారత్ స్లీపర్ రైలును సాధారణ భారతీయ స్లీపర్ రైళ్లతో పోల్చలేం. దీని డిజైన్ పూర్తిగా యూరోపియన్ రోలింగ్ స్టాక్ ప్రమాణాలను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణంలో ప్రయాణికులకు నిశ్శబ్దం, స్థిరత్వం, సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఈ కోచ్‌ల నిర్మాణం జరిగింది.
ప్రతి కోచ్‌లో మెత్తటి బెర్త్‌లు, శరీరానికి ఒత్తిడి తగ్గేలా రూపొందించిన పరుపులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు భారత రైళ్లలో పెద్ద సమస్యగా ఉన్న పై బెర్త్‌లకు ఎక్కడం–దిగడం అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త తరహా నిచ్చెన డిజైన్, మెరుగైన గ్రిప్ హ్యాండిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వృద్ధులు, మహిళలు కూడా సులభంగా ఉపయోగించుకునేలా ఈ మార్పులు చేశారు.
రాత్రి నిద్రకు భంగం కలగకుండా లో–ఇంటెన్సిటీ నైట్ లైటింగ్ (తక్కువ వెలుతురు ఉండేలా) వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా జిగేలుమనే వెలుతురు బదులు, సాఫ్ట్ లైటింగ్(మెల్లగా వెలగడం)తో కోచ్ మొత్తం ప్రశాంత వాతావరణాన్ని కల్పించేలా డిజైన్ చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునేలా ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక రీడింగ్ ల్యాంప్ ఉంది. ఈ రైలు లోపలి సౌకర్యాలు విమాన ప్రయాణ అనుభూతిని తలపించే స్థాయిలో ఉన్నాయి. విమానాల్లో వాడే తరహా బయో–వాక్యూమ్ టాయిలెట్లు అమర్చడంతో శుభ్రత, దుర్గంధ నియంత్రణ మెరుగుపడటంతో పాటు, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక టాయిలెట్, చిన్నపిల్లల కోసం బేబీ కేర్ యూనిట్ ఏర్పాటు చేశారు. భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా, ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో వేడి నీటితో షవర్ బాత్ సదుపాయం కల్పించడం విశేషం. ప్రతి కోచ్ పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్‌వేలు, ఆటోమేటిక్ ఇంటర్‌కనెక్టింగ్ డోర్లతో రూపొందించారు. దీని వల్ల బయట ధూళి, శబ్దం, ఉష్ణోగ్రత మార్పులు లోపలికి ప్రవేశించకుండా నియంత్రించవచ్చు. ప్రయాణమంతా స్థిరమైన గాలి నాణ్యత, నిరంతరంగా సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత ఉండేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అదనంగా, ప్రతి ప్రయాణికుడికి మొబైల్ చార్జింగ్ పాయింట్లు, USB సాకెట్లు, ఫోల్డబుల్ టేబుల్‌లు ఉన్నాయి. కోచ్‌ల లోపలి గోడలు GFRP ప్యానెల్స్‌తో ఫినిషింగ్ చేయడంతో శుభ్రంగా ఉండటం, విజువల్ డిస్‌ప్లేలకు అనుసంధానమైన ఆడియో అనౌన్స్‌మెంట్స్, సీసీటీవీ నిఘా వ్యవస్థలు ప్రయాణికులకు సౌకర్యాలను, భద్రతను మరింతగా పెంపొందించాయి.
ఈ వందే భారత్ స్లీపర్ రైలు కేవలం వేగం కోసం రూపొందించిన రైలు కాదు. హోటల్–విమాన–రైల్వే సౌకర్యాల సమ్మేళనంగా, రాత్రి ప్రయాణాన్ని శ్రమగా కాకుండా విశ్రాంతిగా మార్చే లక్ష్యంతో ఈ డిజైన్‌ను భారత రైల్వే అమలు చేసింది.
వందేభారత్ రైలు లోపలి ఏర్పాట్లు : విమానానికి తక్కువ కాకుండా.. (ఫోటోలు)

200కు పైగా స్లీపర్ రైళ్లు… దూర ప్రయాణాల్లో భారీ మార్పు
భారత రైల్వే శాఖ రాబోయే సంవత్సరాల్లో 200కుపైగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రైళ్లను భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) మరియు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. మరోవైపు భారత్–రష్యా భాగస్వామ్యంతో ఏర్పడిన కినెట్ సంస్థ, అలాగే టిటాగఢ్ రైల్ సిస్టమ్స్–భెల్ కన్సార్టియం కూడా పెద్ద సంఖ్యలో స్లీపర్ వేరియంట్ల తయారీకి ఒప్పందాలు పొందాయి.
ఈ రైళ్లు సాధారణంగా గంటకు 160 కిమీ ఆపరేటింగ్ వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ, ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి వేగం నిర్ణయించబడుతుంది. మొదట అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రవేశపెట్టి, క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. రాత్రి ప్రయాణంలో సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తూ, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థాయి సేవలను మించిపోయే సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ రైళ్లు భారత దూర రైల్వే ప్రయాణానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram