ఆ స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తేనే ఢిల్లీకి ఉప‌శ‌మ‌నం.. పంజాబ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

కొయ్య‌కాళ్ల ద‌హ‌నంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్ర‌తి ఏటా ఢిల్లీ న‌గ‌రం ఇలా కాలుష్య‌కాసారంగా మార్చ‌రాద‌ని వ్యాఖ్యానించింది.

  • Publish Date - November 7, 2023 / 08:52 AM IST

పంజాబ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీ, యూపీ, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వాల‌కు చీవాట్లు


కొయ్య‌కాళ్ల ద‌హ‌నంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్ర‌తి ఏటా ఢిల్లీ న‌గ‌రం ఇలా కాలుష్య‌కాసారంగా మార్చ‌రాద‌ని వ్యాఖ్యానించింది. దీనికి స‌త్వ‌ర‌మే ప‌రిష్కారం ఆలోచించాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ విష‌యంలో స్టేక్‌హోల్డ‌ర్స్ అంద‌రూ బుధ‌వారం స‌మావేశం కావాల‌ని పేర్కొన్న‌ది. అంతా ఒక చోట స‌మావేశ‌మ‌వుతారా? లేక జూమ్‌లో స‌మావేశ‌మ‌వుతారా? ఆలోచించుకోవాల‌ని చెప్పింది. ఏది ఏమైనా శుక్ర‌వారానికి ఒక స్ప‌ష్ట‌త‌కు రావాల‌ని జ‌స్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఢిల్లీ వాయు కాలుష్య అంశం రాజ‌కీయ చ‌ర్చ‌లు మార‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ న‌గ‌రంలో వాయు కాలుష్యం కార‌ణంగా చిన్న‌పిల్ల‌లు ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని ఈ కేసులో అన్ని రాష్ట్రాల న్యాయ‌వాదుల‌ను ఉద్దేశించి జ‌స్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.


పంజాబ్ త‌ర‌ఫున అటార్నీ జ‌న‌ర‌ల్ మాట్లాడుతూ.. కొయ్య‌కాళ్ల ద‌హ‌నం అనేది 20 నుంచి 50 రోజుల మ‌ధ్యే జ‌రుగుతుంద‌ని అన్నారు. దీనికి జ‌స్టిస్ కౌల్ స్పందిస్తూ.. ఇది కొయ్య‌కాళ్లు ద‌హ‌నం చేసే స‌మ‌య‌మ‌ని చెబుతూ.. మీరేం చేస్తారో మాకు తెల‌య‌దు.. కానీ.. ఇది ఆగిపోవాలి. కొన్నిసార్లు బ‌ల‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంది. కొన్నిసార్లు ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించ‌డం ద్వారా కూడా ఆపొచ్చు.. అని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. పంజాబ్ ప్ర‌భుత్వం దీన్ని ఆపాల్సిందేన‌ని జ‌స్టిస్ కౌల్ స్ప‌ష్టం చేశారు. మీ అధికార యంత్రాంగం ఈ బాధ్య‌త తీసుకోవాల‌ని అన్నారు. స్థానిక స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌ను బాధ్యుడిగా పెట్టాల‌ని అన్నారు. ఈ రోజు నుంచి ఆ కృషి జ‌ర‌గాల‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో దేశ రాజ‌ధానిలోకి వాహ‌నాల రాక‌ను నిరోధించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఢిల్లీ న‌గ‌రానికి వాహ‌నాల కాలుష్యం కూడా పెద్ద స‌మ‌స్య‌గా ఉన్న‌ది.


పంట పొలాల ద‌హనాన్ని నివారించేందుకు ప్ర‌త్యామ్నాయ (వ‌రి) పంట‌ల‌వైపు మ‌ళ్లేందుకు ఆయా రాష్ట్రాల‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాదికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. ఈ ప‌రిస్థితిని ఇంకెంత మాత్ర‌మూ స‌హ‌క‌రించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. వాద‌న‌ల సంద‌ర్భంగా అమిక‌స్ క్యూరీ (కోర్టు స‌హాయ‌కుడు) అప‌రాజిత సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మాగ్‌ట‌వ‌ర్ ప‌ని చేయ‌డం లేద‌ని చెప్పారు. దీనిపై ఢిల్లీ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ట‌వ‌ర్లు స‌త్వ‌ర‌మే ప‌నిచేసేలా చూడాల‌ని ఆదేశించింది. న‌గ‌రంలో ఘ‌న వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేయ‌డాన్ని నిరోధించాల‌ని తేల్చి చెప్పింది. పంజాబ్‌, ఢిల్లీ న‌గ‌రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కొయ్య‌కాళ్ల ద‌హ‌నం విష‌యంలో బీజేపీపై మండిప‌డుతున్న‌ది. పంజాబ్‌లో తాము అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి రాష్ట్రంలో కొయ్య‌కాళ్ల ద‌హ‌నం త‌గ్గిపోయింద‌ని, కానీ.. బీజేపీ అధికారంలో ఉన్న హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొయ్య‌కాళ్ల ద‌హ‌నాన్ని ఆ ప్ర‌భుత్వాలు నియంత్రించ‌లేక పోతున్నాయ‌ని ఆరోపిస్తున్న‌ది.

Latest News