Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే చిత్రీకరణ క్లైమాక్స్‌కు చేరుకోగా, మరో నెల రోజుల్లో మొత్తం షూట్ పూర్తి కానుంది. ముందుగా ప్రకటించినట్లుగానే మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాంటి వాయిదాకు అవకాశం లేదన్న టాక్ వినిపిస్తుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
శరవేగంగా షూటింగ్..
ఈ సినిమా షూటింగ్ మొదటగా కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్ ప్యాలెస్ ముందు హీరో–హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ కూడా తెరకెక్కించారు. అనంతరం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించి అక్కడ కూడా అనేక ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేశారు. మధ్యలో మరోసారి మైసూర్ వెళ్లి, తొలి షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న సన్నివేశాలను పూర్తి చేశారు.
అయితే ‘పెద్ది’ విషయంలో అత్యంత హైలైట్ అవుతున్న లొకేషన్‌గా రాజధాని ఢిల్లీ నిలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటివరకు మూడు సార్లు ఢిల్లీలో షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఓ క్రికెట్ స్టేడియంలో నైట్ సీన్స్ చేస్తున్న సమయంలోనే, ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లి అక్కడ కుస్తీ పోటీలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించి వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలోని ఓ స్టేడియంలోనే ఈ సన్నివేశాలు షూట్ కావడంతో కంటిన్యుటీ పరంగా కూడా అవి చాలా కీలకంగా మారాయి.
ఢిల్లీలోనే ఎందుకు…
తదుపరి షెడ్యూల్‌లో మరోసారి ఢిల్లీ వేదికగా కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈసారి స్టేడియం పరిధిని దాటి, ఢిల్లీ వీధుల్లోనే షూటింగ్ జరిపారు. ప్రస్తుతం కూడా చిత్రబృందం ఢిల్లీలోనే షూటింగ్ కొనసాగిస్తోంది. తాజా షెడ్యూల్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర చలికాలంలో ఢిల్లీలో షూటింగ్ చేయడం సాధారణ విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే హైదరాబాద్‌లోనే తక్కువ ఖర్చుతో ఢిల్లీ లొకేషన్లకు సెట్లు వేసుకుని షూటింగ్ చేయొచ్చని, అయినప్పటికీ చిత్రబృందం మూడు, నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లడం వెనుక గట్టి కారణం ఉందని టాక్. సినిమాలో ఢిల్లీ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి, భారీ బడ్జెట్‌తో, పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కుతున్న ‘పెద్ది’లో ఢిల్లీ ఎపిసోడ్స్ కథలో కీలక మలుపుగా నిలవనున్నాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశమే సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
