– వంద ఎకరాలకైనా నీళ్లిచ్చావా?
– ఎస్పీఎం కంపెనీలో స్థానికేతరులకు ఉద్యోగాలా?
– బీఆరెస్ తో సిర్పూర్ అభివృద్ధి కనుమరుగు
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
– సిర్పూర్ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ నామినేషన్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘సిర్పూర్ నియోజకవర్గం 10 ఏళ్ల కింద ఎట్లుందో.. ఇప్పుడట్లనే ఉంది. బస్టాండ్ లేదు. ఆసుపత్రి లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఉంది.. అలాంటిది బీఆరెస్ ఎమ్మెల్యే కోనప్పకు ఎందుకు ఓటేయాలి? తెలంగాణలో కోనప్పా.. ఇక చాలప్ప… ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం బండి సంజయ్ హాజరయ్యారు. నామినేషన్ అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయ సంకల్ప సభలో మాట్లాడారు. ‘నియోజక వర్గంలో ఎంతో మంది రైతులున్నరు. కానీ వంద ఎకరాలకైనా సాగునీరిచ్చిండా? సాగు నీరివ్వలేని దుస్థితి. నదులకు నడక నేర్పిన ఇంజనీర్ కేసీఆర్ కు కాగజ్ నగర్ రైతులు కనబడతలేదా? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకు పోతే, మరి ఇక్కడి రైతుల సంగతేందని అడగడు.. బ్రిడ్జి లు కావాలని, రోడ్లు కావాలని అడగడు.
ఏమైనా అంటే కేంద్రం నిధులిస్తలేదని బద్నాం చేసుడు తప్ప ఆయన చేసిన పని ఒక్కటైనా ఉందా?’ అంటూ బీఆరెస్ ప్రభుత్వంపై బండి ధ్వజమెత్తారు. వార్దా నది మీద ప్రాజెక్ట్ కడతానని మాయమాటలు చెబుతూ, మళ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నడు. కేవలం అధికారం, డబ్బు తో ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్నడే తప్ప ఏనాడైనా ఫలానా పని చేశాను? ఫలానా చోట అభివృద్ధి చేశానని చెప్పిండా? పల్లెల్లోకి పోయి ఓపెన్ గా ప్రజలతో ముఖముఖి ఏర్పాటు చేసి అభివృద్ధి చెప్పే ధైర్యం ఉందా? అంటూ ఎమ్మెల్యే కోనేరు కొనప్పను నిలదీశారు. సొంత ఎజెండాతో కాంట్రాక్టులు తన సొంత మనుషులకే ఇస్తున్నాడు. అంబలి, అన్నదానం చేస్తున్నానని ప్రచారం చేసుకుంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోడన్నారు. కొనప్పా, అతని సోదరులు లిక్కర్ వ్యాపారం, బియ్యం దందా తో పాటు మట్కా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీఎం కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలియ్యకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలే తప్ప, ఇంకా ఎందుకు పోటీ చేస్తున్నట్లు? చేసిన పాపాలన్నీ పోవాలని, మళ్లీ గెలవాలని అన్నదానం చేస్తే గెలుస్తాననుకుంటున్నవా? నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు. కేసీఆర్ ది కూడ ఇంతే. రాజసూయ యాగం పేరుతో క్షుద్ర పూలు చేస్తున్నారని తెలిపారు.
ఉద్యోగులకు మూన్నెల్లకోసారే జీతాలు
ఉద్యోగ, ఉపాధ్యాయులారా… ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర మీతోనే సాధ్యమవుతుంది. కేసీఆర్ అరాచక పాలన ఎట్లుందో, మీరు పడ్డ గోసను గుర్తు చేసుకోని కేసీఆర్ పాలనకు చమర గీతం పాడి మీకోసం కొట్లాడిన బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ కోరారు. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారలోకి వస్తే ఉద్యోగులకు 3 నెలల కోసారి జీతాలొస్తయని తెలిపారు. బదిలీలు, ప్రమోషన్లు రావని గుర్తుంచుకొవలని పేర్కొన్నారు. టీఏస్ పిఏస్ సి పేపర్ లీకేజీ ముసుగులో యాభై ఏడు లక్షల మంది యువకుల బతుకులను రోడ్డుకు ఈడ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో తొలి ఓటర్ ఉన్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ అని, బీజేపీ తొలి విజయం కూడా సిరిపూర్ నుండి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే మధ్యంతరం తప్పదని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడితే జైలుకు పోయిన చరిత్ర పాల్వాయి హరీష్ ది అని, కొవిడ్ తో బాధపడుతున్నా వినకుండా హరీష్ ను గుంజుకుపోయి జైల్లో వేయించిన నీచుడు కోనప్ప… అయినా భయపడకుండా పోరాడిన చరిత్ర హరీష్ రావు కుటుంబానిదే అని అన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రత్యేక నిధులు కేటాయించి, సిర్పూర్ కాగజ్ నగర్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్ మిల్లులో స్థానికులే ఉద్యోగాలిప్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.