హైదరాబాద్,విధాత: కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాలకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో భాగంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడారు. కరోనా బాధితులకు ఉచిత వైద్యం, ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీలో చేర్చలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు. తొమ్మిది నెలలు అవుతున్నా ఆ హామీని అమలు చేయలేదని ఆక్షేపించారు. ఎన్నికల్లో గెలవడం, నేతలను కొనుగోలు చేయడంపైనే కేసీఆర్ దృష్టి ఉందని ఆరోపించారు. కొవిడ్‌తో ఎంతోమంది చనిపోతున్నా సీఎంకు పట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులు తదితరాలపై రూ.వేల కోట్లు వెచ్చించకుండా ప్రజారోగ్యానికి అధిక నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.