ఎన్నికల ప్రచారంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క
విధాత, కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో అధికారంలోకి రాబోతున్నదని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలోనే ప్రజలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కేసీఆర్ కారు టైర్ ఫంక్చర్ అవుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7,8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అఖండ మెజార్టీతో గెలుస్తున్నదన్నారు. బీఆరెస్ ను వదిలించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా దారి మళ్లించిందని ఆరోపించారు. ఏసిడిపి నిధులను ఫ్రీజింగ్ చేయడం వల్ల మారుమూల పల్లెలు అభివృద్ధి జరగలేదన్నారు. కాళేశ్వరం నిర్మాణం పేరిట రాష్ట్ర సంపదను కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులను దళితుల అభ్యున్నతికి ఖర్చు పెట్టడానికి అంబేద్కర్ అభయ హస్తం పథకం తీసుకొచ్చామన్నారు. ఈ పథకం ద్వారా దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. తెలంగాణలో ప్రజల కష్టాలు పోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు.
పర్యాటక ప్రాంతంగా జమలాపురం దేవాలయం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటం మధిర నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టమని భట్టి అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైయున్న జమలాపురం దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో రక్తాన్ని చెమటగా మార్చి కష్టం చేసిన కూలి డబ్బులను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న అభిమానంతో మాణిక్యమ్మ తన విజయానికి విరాళంగా ఇవ్వడం నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నానన్నారు. మధిర నియోజకవర్గంలో మీ బిడ్డ నైనా నేను గెలవాలన్న తపన, ప్రేమ, అభిమానానికి జీవితమంతా రుణపడి ఉంటానని భట్టి తెలిపారు.