విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సామాజిక సమస్యలతో పాటు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అందరం ఆశించామని, కానీ వివిధ సమష్యల పరిష్కారం కోసం వేలాది ప్రాతినిధ్యాలు అనేక ఉద్యమాలు చేసినప్పటికినీ గత ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించకుండా న్యాయపరమైన చిక్కుల సాకుతో, వివిధ సబ్జెక్టు ఉపాధ్యాయుల మధ్య ఉన్న విభేదాలంంటూ పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని టీపీటీఎఫ్ (తెలంగాణా ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవిందర్ విమర్శించారు. కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు విద్యారంగ చరిత్రలో మొదటిసారిగా దాదాపు 30 వేలమంది (క్యాడర్ లో దాదాపు 30 శాతం) ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సులువుగా పరిష్కరించిందని, సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రమోషన్లు రావడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని గుర్తు చేశారు. అయితే విద్యా శాఖలోని ప్రధానోపాధ్యాయుల పైస్థాయి పోస్టుల్లో ఇంకా ప్రతిష్టంభన నెలకొని ఉందన్నారు. ఈ ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేస్తే వేలాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా అడ్మిషన్లు పొందడమే కాకుండా, మెరుగైన విద్యా ప్రమాణలు సాధించే వీలు కలుగుతుందన్నారు.
ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ స్వాగతిస్తున్నాం
ఉపాధ్యాయ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి పదోన్నతులు పొందిన 30 వేలమంది ఉపాధ్యాయులతో 2024 ఆగస్ట్ రెండో తేదీన బహిరంగంగా సమావేశం నిర్వహించాలనుకోవడం చారిత్రాక, ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఇదే సమయంలో విద్యారంగంలో పెండింగ్ లోనున్న కింద పేర్కొన్న సమస్యలపై కూడా దృష్టి సారించి, వేగంగా పరిష్కరిస్తే సీఎం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందుతారన్నారు. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా మెరుగైన విద్యాప్రమాణాలు సాధిస్తుందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ చేసిన నేపథ్యంలో కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోనికి వచ్చాయని, తద్వారా గత మూడు దశాబ్దాలుగా న్యాయస్థానల్లో వివాదాల వలన పూర్తి స్థాయిలో పరిష్కరించబడని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం సాంకేతిక, న్యాయపరమైన వివాదాలు లేనందున వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతుల, నియామకాల ప్రక్రియలను చేపట్టాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం 10 జిల్లాలకు గాను 12 డీఈఓ స్థాయి పోస్టులు మంజూరయ్యాయని, కానీ ప్రస్తుతము కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ విద్యాధికారు(డీఈఓ) లు పనిచేస్తున్నారని, మిగతా 30 జిల్లాలు ఇంచార్జి డీఈఓ లతో నెట్టుకొస్తున్నాయని పేర్కోన్నారు. జిల్లా విద్యాధికారుల పొస్టుల్లోనే రెగ్యులర్ విద్యాధికారులు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు ఎలా వుంటాయో చూస్తున్నామని, వెంటనే అన్ని జిల్లాలకు రెగ్యులర్ డీఈఓ పోస్టులు మంజూరు చేసి, పదోన్నతుల ద్వారా నియమించాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 ఉప విద్యాధికారుల, 580 మండల పర్యవేక్షకులు పోస్టులలో వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అదనపు బాధ్యతలతో పనిచేస్తూ వారి వారి పాఠశాలల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో పూర్తి స్థాయి విధులు నిర్వహించలేక పోవడం వల్ల మెరుగైన ప్రమాణాలు సాధించలేకపోతున్నారన్నారు. . కావున అన్ని ఉప విద్యాధికారుల, మండల పర్యవేక్షకులు పోస్టులను పదోన్నతులు, నియామకాల ద్వారా నింపి ఆయా విధుల్లో అదనపు బాధ్యతల్లో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయలను రిలీవ్ చేసి పాఠశాలల ప్రమాణాలను పెంచడానికి కృషిచేయాలని కోరారు.
డీఈడీ, బీఈడీ ఉపాధ్యాయుల మధ్య గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఏర్పడ్డ పరస్పర వాదనలతో, న్యాయపరమైన చిక్కులతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టుల నుండి ప్రధానోపాధ్యాయల పోస్టుల ఉన్నతీకరణ ఆగిపోయిందన్నారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయల పోస్ట్ లు 10వేలకు పెంచి ఎస్జీటీ లందరికీ పదోన్నతులలో అవకాశం ఇవ్వాలని కోరారు.
పాఠశాలల ప్రమాణాలను పెంచాలి
మారుతున్న జాతీయ, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు పరిస్థితులకనుగుణంగా మన పాఠశాలలను తీర్చిదిద్దడం, ప్రయివేటు తో పోటీ పడటం కోసం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఎస్జీటీలను నియమించాలన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి ఎప్పటికప్పుడు శాస్త్రీయ, సాంకేతిక మరియు సామాజిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరుపుతూ కరిక్యులం ప్రణాళికలు తయారు చేయాలని, దానికోసం నిష్ణాతులైన మేధావులు, ప్రొఫెసర్లు, విషయ నిపుణులతో నిరంతర వర్క్ షాప్ లు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులలో శాస్ర్తీయ దృక్పథం అలవర్చే నూతన పాఠ్య పుస్తకాల తయారీ చేయాలని, అనుభవజ్ఞుల చేత నాణ్యమైన ప్రశ్న పత్రాల తయారీ చేయాలని, నూతన విద్యా ప్రణాళికలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మూల్యాంకనపై పరిశోధనలు చేస్తూ నూతన విద్యా లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నారు.
నియమకాలు పూర్తి చేస్తేనే సత్ఫలితాలు
అయితే గత దశాబ్ద కాలంగా ప్రొఫెసర్ల, అధ్యాపకుల నియామకం జరగక కేవలం ఆ పనులన్నీ డిప్యుటేషన్ టీచర్లతో నామమాత్రంగా నడుస్తున్నాయని, విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం అత్యంత వెనుకబడడానికి దేశంలోని 28 రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉన్నట్టు ఏఎస్‌ఈఆర్, ఎన్‌ఏఎస్ నివేదికలు చెబుతున్నాయని, కాబట్టి దాదాపు 100% ఖాళీలుగా ఉన్న ఎస్‌సీఈఆర్‌టీ లోని ప్రొఫెసర్, అధ్యాపక పోస్టులలో అర్హులైన వారిని పదోన్నతులు, నియామకాల ద్వారా నియమించి వార్షిక విద్యా ప్రణాళికను, బోధనాపద్ధతులను, ఉపాధ్యాయ ట్రైనింగ్ లను, పర్యవేక్షణ మరియు మూల్యాంకనలను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రేపటి భవిష్యత్ కోసం విద్యార్థులలో మెరుగైన సామర్థ్యాలను సాధించగలమన్నారు. గత దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ శిక్షణ కోసం బీఈడీ కళాశాలల్లో లేదా డైట్‌లలో చేరుతున్న చాత్రోపాధ్యయులు చేరిన అనంతరం పూర్తి నైపుణ్యాల సాధన లేకుండానే శిక్షణ పూర్తి చేస్తున్నారన్నారు. కారణం అక్కడ పార్ట్ టైం బోధకులు లేదా రిటైర్డ్ అధ్యాపకులు లేదా అసలు బోధకులే లేక పోవడమేనని, 18 ప్రిన్సిపాల్ పోస్టులలో; 74 బీఈడీ కాలేజి అధ్యాపకుల పోస్టులలో; 286 డైట్ అధ్యాపకుల పోస్టులలో దాదాపు అన్ని ఖాళీలే. అంటే ఉపాధ్యాయ శికక్షణా కళాశాలల్లో వంద శాతం ఖాళీగా ఉండడం మన విద్యాశాఖ దీనావస్థకు నిదర్శనమన్నారు. కావున ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో గల ఖాళీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. తద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులు తయారయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రభుత్వ ,జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ , ఎయిడెడ్, సింగరేణి , గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పడ్డ ఉపాధ్యాయ ఖాళీలలో 70% ను ఎప్పటికప్పుడు నెలవారీ పదోన్నతుల ద్వారా నింపి మెరుగైన స్టాఫ్ పాటర్న్ పాఠశాలల్లో ఉండేలా చూడాలన్నారు. అన్ని పాఠశాలలకు గుమస్తా, ఆఫీస్ సబార్డినేట్, స్కావెంజర్ పోస్టులను మంజూరు చేసి నియామకాలు జరిపి పాఠశాలలో బోధనేతర కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులకు విముక్తి చేయాలన్నారు. అంటే ప్రతి ఉన్నత పాఠశాలలకు, స్కూల్ కాంప్లెక్స్‌కు గుమస్తా, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ , స్కావెంజర్ పోస్టులను మంజూరు చేయాలని,. ప్రాథమిక పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్, స్కావెంజర్లను నియమించాలని ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.