– చివరి నిమిషంలో పార్టీలు మారిన నేతలు
– రెంటికీ చెడ్డ రేవడిలా సీనియర్ల పరిస్థితి
– పాలమూరులో మాజీ మంత్రి పొడపాటి
– జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
– నాగర్ కర్నూల్ లో నాగం.. షాద్ నగర్ లో ఇబ్రహీం
– అలంపూర్ లో మాజీ ఎమ్మెల్యే అబ్రహం
– చెల్లకుండా పోయిన సీనియర్ నేతల రాజకీయo
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: శాసనసభ ఎన్నికల రాజకీయం పాలమూరులో పలు పార్టీల సీనియర్లకు చేదు అనుభవమే మిగిల్చింది. సీనియర్ నేతలని నమ్మితే నట్టేట ముంచారని ఆయా పార్టీల అభ్యర్థులు ఆవేదన.. చివరి నిమిషంలో పార్టీ మారి పరువు పోగొట్టుకున్నామని సీనియర్ నేతల అక్రందన.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు వచ్చినా ఏమీ ఒరగలేదని ఇటు గులాబీ.. అటు హస్తం పార్టీల అభ్యర్థులు అంతర్మథనంతో కుమిలిపోతున్నారు. సీనియర్ నేతలు వస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందనే విశ్వాసంతో అభ్యర్థులు వారికే పెద్ద పీట వేసి, ప్రచారంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎన్నికల చివరి నిమిషంలో పార్టీలు మారి, రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. ప్రజల్లో ఉన్న కాసింత మంచి పేరును కోల్పోయామని సీనియర్ నేతలు లోలోన మదనపడుతున్నారు. సొంత పార్టీలోనైనా ఉన్నా కొంతైనా గౌరవం దక్కేదని సన్నిహితులతో తమ ఆవేదన పంచుకుంటున్నారు. అభ్యర్థులు మాత్రం సీనియర్ నేతలు పార్టీలోకి వచ్చి నట్టేట ముంచారనే ధోరణిని వీడడం లేదు.
మహబూబ్ నగర్: ఈ నియోజకవర్గంలో ఎన్నికల చివరి నిమిషంలో పార్టీలు మారిన మాజీ మంత్రి, బీజేపీ నేత పొడపాటి చంద్రశేఖర్ పరిస్థితి దయనీయంగా మారింది. తెలుగుదేశం హయాంలో 14 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. కొంతకాలం బీజేపీలో చేరారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసి, అకస్మాత్తుగా రాత్రికి రాత్రే బీఆర్ ఎస్ లో చేరారు. ఈ పరిణామానికి బీజేపీ శ్రేణులు ఖంగుతిన్నారు. పొడపాటి రాకతో బీఆర్ ఎస్ కు బలం పెరిగిందని అ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అనుకున్నారు. వెంటనే చంద్రశేఖర్ కు ప్రచార బాధ్యతల్లో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ప్రజలు చంద్రశేఖర్ ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. శ్రీనివాస్ గౌడ్ వెన్నంటే ప్రచారంలోనూ ఉన్నారు. కానీ ఆయన ప్రభావం ఎన్నికల్లో ఏమీ ఒరగలేదనే విషయం ఓటమి తరువాత కానీ శ్రీనివాస్ గౌడ్ తెలుసు కోలేకపోయారు. మరో ఇద్దరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పటి తెరాస నేత సయ్యద్ ఇబ్రహీం కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్ లో చేరారు. శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో నడిచారు. వీరి వల్ల భారీ నష్టం జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సొంత పార్టీలోనే ఉన్నా కొంతైనా పరువు ఉండేదని ఈ ముగ్గురు నేతలూ వాపోతున్నారు. శ్రీనివాస్ గౌడ్ నుంచి భారీగా ఆశించి పార్టీలో చేరి నిలువునా ముంచారనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది.
జడ్చర్ల : ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. రాకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచారు. ముదిరాజ్ ల ఓట్లు రాబట్టాలని లక్ష్మారెడ్డి ఆశించారు. కొన్ని రోజులు ప్రచారం చేసి, ముదిరాజ్ లు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఎర్ర శేఖర్ కోరినా, ఫలితం దక్కలేదు. ఎర్ర శేఖర్ ప్రభావం చాలా ఉంటుందని భావించిన లక్ష్మా రెడ్డికి ఓటమి తరువాత తెలిసి వచ్చింది. మరోవైపు ఎర్ర శేఖర్ ప్రభావం నారాయణ పేట, మక్తల్ నియోజకవర్గాలపై కూడా పడింది. ఇక్కడ కూడా ముదిరాజ్ ఓట్ల లక్ష్యంగా ప్రచారం చేసినా.. ఎర్ర శేఖర్ ను ఎవరూ నమ్మలేదు. ఈయన వల్ల తీవ్రంగా నష్టపోయామని ఓటమి తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు కళ్ళు తెరిచారు.
నాగర్ కర్నూల్: రాజకీయంలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నాగం జనార్ధన్ రెడ్డి ఎన్నికల సమయంలో పార్టీ మారి బొక్కబోర్లా పడ్డారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయం లో పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన నాగం.. అసెంబ్లీ టైగర్ గా పేరుపొందారు. ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగు కావడంతో కొత్త పార్టీ పెట్టి ఆదరణ లేక పార్టీని రద్దు చేసి బీజేపీ లో చేరారు. మళ్ళీ కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరి నాగర్ కర్నూల్ లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ ఎస్ లో చేరారు. ఈ సమయంలో నాగం తీరుపై కాంగ్రెస్ నేతలే కాకుండా ఇతర పార్టీల నాయకులు సైతం విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అప్పట్లో నాగం విషయంలో ఘాటుగానే స్పందించారు. అవుట్ డేటెడ్ నాయకులు వెళ్తే కాంగ్రెస్ కు నష్టం జరగదని బాహాటంగా ప్రకటించారు. సీనియర్ నేత నాగం రాక బీఆర్ఎస్ కు కలిసి వస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి ఆశించి భంగపడ్డారు. నాగం ప్రచారం చేసినా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని నేడు వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో నాగం అంటే కొంత అభిమానం ప్రజల్లో ఉండేది. కానీ పార్టీ మారి, ఉన్న కాస్త పరువును గంగలో కలుపుకున్నారన్న విమర్శను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నా ఎమ్మెల్సీ వచ్చేదని ప్రస్తుతం నాగం ఆవేదన చెందుతున్నారు. నాగం రాజకీయ భవిష్యత్ కనుమరుగైనట్లే అని నియోజకవర్గంలో టాక్.
అలంపూర్: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ లో చేరారు. ఈయన రాక కాంగ్రెస్ కు కలిసివస్తుందని ఆ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ అనుకున్నారు. కానీ అబ్రహం కాంగ్రెస్ లోకి వచ్చినా ప్రయోజనం లేదనే అభిప్రాయం ఓటమి తర్వాత సంపత్ తెలుసుకున్నారు. అబ్రహంకు ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్లే బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. ఈ విషయం తెలియని కాంగ్రెస్ నేతలు అబ్రహం పార్టీలో చేరగానే కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని పొంగిపోయారు. చివరి ఓటమే మిగిలింది. మరోవైపు పార్టీలో ఉన్నా పరువు దక్కేదని అబ్రహం ఆవేదన చెందుతున్నారు.
షాద్ నగర్: ఈ నియోజకవర్గంలో కూడా చివరి సమయంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన సయ్యద్ ఇబ్రహీం పరిస్థితి దారుణంగా మారింది. ఆయన చేరినా ఉపయోగం లేకపోవడం, అనవసరంగా పార్టీలో చేర్చుకున్నామనే ధోరణిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇబ్రహీం పార్టీలోకి రావడంతో మైనారిటీ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు పడతాయని భావించిన ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తరువాత తెలిసివచ్చింది. ఇబ్రహీం వల్ల మైనారిటీ ఓట్లు వచ్చేవి కూడా పడలేదనే అభిప్రాయం ఆపార్టీ నేతల్లో ఉంది. కాగా కాంగ్రెస్ లో ఉన్నా పరువు దక్కేదని ఇబ్రహీం అంటున్నారు. షాద్ నగర్ తో పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గం లో ఇబ్రహీం ప్రచారం చేసినా మైనారిటీ ఓట్లు రాల్చలేక పోయారు. ప్రస్తుతం ఇబ్రహీం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. చివరి నిమిషంలో పార్టీ మారిన సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు.