– పదేళ్లుగా డ్రైనేజీ నిర్మించలేదు
– ఎస్సీ కాలనీ వాసుల నిలదీత
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాం పల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, యువకులు అభివృద్ధిపై నిలదీశారు. పదేళ్లుగా ఎస్సీ కాలనీకి ఏం చేశావని ప్రశ్నించారు. కనీసం డ్రైనేజీ కూడా నిర్మించలేదంటూ వాపోయారు. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.3 లక్షలు వచ్చినపుడు కూడా ఈ కాలనీలో డ్రైనేజీ సమస్య తీర్చలేకపోయారని, ఎలా ఓట్లు వేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ కాలనీలో 200 మంది నివాసముంటున్నా, ఇక్కడ డ్రైనేజీ లేక మురుగు నీటిలో నడుస్తున్నామన్నారు. మీరూ ఒకసారి నడిస్తే మా బాధ అర్థం అవుతుందని దివాకర్ రావుతో వాగ్వాదానికి దిగారు. ఓట్లు వేసిన మాకు ప్రశ్నించే హక్కు ఉందని నిలదీశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందిస్తూ , నేను గెలిచిన తర్వాత మూడు నెలల్లోపు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.