తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ మంచిదే: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు సమావేశం కానుండటం మంచిదేనని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు

  • Publish Date - July 4, 2024 / 04:05 PM IST

ఢిల్లీ పర్యటనలతో సీఎం రేవంత్‌రెడ్డి సమయం వృథా
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

విధాత : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు సమావేశం కానుండటం మంచిదేనని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటినా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతోందని విమర్శించారు. పాలనాపరమైన అంశాలపై ఆయన పట్టు సాధించలేకపోతున్నారని విమర్శించారు.

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఇది పాత సంప్రదాయమేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందరికాళ్లకు కాంగ్రెస్ హైకమాండ్ బంధం వేస్తుందని, కీలక శాఖలన్ని సీఎం వద్ద ఉన్నా నియంత్రణ ఢిల్లీలో ఉందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వస్తారని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చారని, అదే పద్దతిలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కూడా రద్ధు కావచ్చని, ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చిందో లేదోనన్నారు. నలుగురు నాయకుల మధ్య తెలంగాణ హస్తం పార్టీ ఇరుక్కుందని, పాలన గాడి తప్పుతుందని విమర్శించారు. హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగిందని, ఖజానా ఖాళీ అయిందని అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.

Latest News