ఇందూరులో వికసించిన కమలం

ఎంతో ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన ఇందూరులో కమలం వికసించింది. ఇందూరు గడ్డపై కాషాయం జెండా ఎగిరింది. ఎన్నికల త్రిముఖ పోరులో ఇందూరు ప్రజలు బీజేపీకే పట్టంకట్టారు

  • Publish Date - December 3, 2023 / 12:54 PM IST

– బీజేపీకి పట్టం కట్టిన ఓటర్లు

– రెండో స్థానంలో కాంగ్రెస్

– మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్

విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఎంతో ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన ఇందూరులో కమలం వికసించింది. ఇందూరు గడ్డపై కాషాయం జెండా ఎగిరింది. ఎన్నికల త్రిముఖ పోరులో ఇందూరు ప్రజలు బీజేపీకే పట్టంకట్టారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ఘనవిజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో అన్ని రౌండ్లలో.. ఉత్కంఠ పోరులో మొదటి నుండి ఆధిక్యత ప్రదర్శించిన ధన్ పాల్ సూర్యనారాయణ 7వ రౌండ్ వచ్చే సరికి కొంత వెనక బడ్డారు. తర్వాత వచ్చిన రౌండ్లలో అనూహ్యంగా ఆధిక్యత పెరిగింది. పదేళ్లుగా సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేష్ గుప్త, మంత్రులుగా పనిచేసి 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీలు గట్టి పోటీ ఇచ్చినా, బీజేపీ అభ్యర్థిని బీట్ చేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగింది. సిటింగ్ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు 44,598 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణకు 73,724 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి 59,104 ఓట్లు పోలయ్యాయి. 21వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి.. సమీప ప్రత్యర్థి షబ్బీర్ అలీపై 14,620 ఓట్లతో విజయం సాధించారు. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో ధన్ పాల్ సూర్యనారాయణకు ఓటర్లు పట్టంకట్టారు.

ఇది ప్రజా విజయం : ధన్ పాల్

ధన్పాల్ సూర్య నారాయణకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అర్బన్ గెలుపుతో బీజేపీ శ్రేణులు, అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ధన్పాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రజల విజయమని ఉద్ఘాటించారు. నిజామాబాద్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించడం మా అదృష్టమని ధన్పాల్ వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ డివిజన్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అర్బన్ లో నన్ను గెలిపించినందుకు అర్బన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ లో ఈ విజయం ప్రధాని మోడీకి అంకితమని వెల్లడించారు. ఈ విజయం ఇందూర్ ప్రజలదని ఉద్ఘాటించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవ చేస్తానని, తన గెలుపుకోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.