విధాత, వరంగల్: గతంలో ఉన్న చట్టం లో మార్పులు తెచ్చి బీజేపీ ప్రభుత్వం పంచాయతీల అధికారాలు, నిధులకు కత్తెర పెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గతంలో ఇచ్చే గ్రాంట్‌ను తగ్గించింది. గతంలో 1830 కోట్లు కేంద్రం ఇచ్చేది. ఈ ఏడాది 500 కోట్లు తగ్గించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కు సమానమైన గ్రాంటును అదనంగా ఇస్తూ గ్రామపంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే… కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచుల అధికారాలను, నిధులను కేంద్రం తగ్గించిందని మంత్రి అన్నారు.
తప్పుడు మాటలతో బీజేపీ సర్పంచులను తప్పుదారి పట్టిస్తోందని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సర్పంచులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిని సరైన దారిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు.
వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.
నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంట నష్ట పరిహారం ఎక్కువ కావాలని అడుగుతున్నారు. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. రూ.1800 కోట్లు రోడ్ల కోసం కేటాయించారని ఇందులో మెయింటెనెన్స్ కోసం రూ. 1000 కోట్లు, దెబ్బ తిన్న రోడ్ల కోసం రూ.800 కోట్లు ఇచ్చారని ఇవి సరిపోవంటే సీఎం రూ. 500 కోట్లు అదనంగా ఇచ్చారు. వీటిలో ఎక్కువగా నష్టపోయిన నర్సంపేట, భూపాలపల్లి, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తాం అని వివరించారు.
రైతులకోసం ఈ ఏడాది వరంగల్ జిల్లాలో రైతు బంధు కింద 2,84,000 మందికి 266.20 కోట్లు ఒక్క వానాకాలంలో ఇస్తున్నాం. రైతు బీమా రూ.5 లక్షలు ఒక్క రాష్ట్రం మాత్రమే ఇస్తుంది. పక్క రాష్ట్రాల్లో పెన్షన్లు రూ.500 మించి లేదు. మన రాష్ట్రంలోనే రూ. 2116 ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00116 ఇస్తున్నామన్నారు. పామ్ ఆయిల్ సాగుకు 2వేల ఎకరాలు జిల్లాలో కేటాయించాం. జిల్లాకు 6 ఫ్యాక్టరీలు వస్తున్నాయి.
చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్యకు పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్ రూ. 1202.75 కోట్లు కేటాయించాం. గ్రామానికి ఇచ్చేవి రూ.5 లక్షలు ఇప్పటి వరకు ఈ ఏడాది జిల్లా పరిషత్ లకు రూ. 86 కోట్లు విడుదల చేశాం.
సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, జడ్పీటీసీలు, ఎంపీపీ , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.