విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉదృతమవుతున్న కొద్ధి ప్రధాన పార్టీల ప్రచార యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆరెస్‌లు రెండు ప్రచార ప్రకటనలలో నిబంధనలు ఉల్లంఘించారని, దాడులకు తెగబడుతున్నారంటూ పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నాయి. గతంలో తామిచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలు ప్రచార ప్రకటనలు నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని మరోసారి బీఆరెస్ పార్టీ లీగల్ సెల్ సోమవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బీఆరెస్ లీగల్ టీమ్ సభ్యులు సోము భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంసీసీ కమిటీల్లో చూపించిన ప్రకటనలు ఒకటి, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు మరోకటి ఉన్నాయని, బీఆరెస్‌ను, నేతలను కించపరిచే విధంగా కాంగ్రెస్ ప్రచార ప్రకటలున్నాయని వాటిని నిషేధించాలని కోరడం జరిగిందన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రచారంలో ఆయనను నిషేధించాలని ఈసీని కోరామన్నారు. అలాగే దుబ్బాక, అచ్చంపేట, ఇబ్రహీం పట్నంలలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు బీఆరెస్ అభ్యర్థులపైన, శ్రేణులపైన దాడులకు పాల్పడ్డాయని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. బీఆరెస్ ఫిర్యాదుపై స్పందిన సీఈవో వికాస్ రాజ్ కాంగ్రెస్ ప్రకటనలను పరిశీలించి నిలిపివేతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రకటనల నిలిపివేత ఆదేశాలపై కాంగ్రెస్ ఫిర్యాదు
తాము ఎంసీసీ కమిటి అనుమతితో ఇచ్చిన ప్రచార ప్రకటనలను నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతు కాంగ్రెస్ సోమవారం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆరెస్, బీజేపీలు తప్పుడు ఫిర్యాదులతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎంసీఎన్‌సీలో మీడియా సర్టిఫికెట్ ఇచ్చిన ప్రచార ప్రకటనలనలు ఆపమనడం సరికాదన్నారు. మెట్రోలో కూడా తమ యాడ్స్ రాకుండా అడ్డుపడుతున్నారనన్నారు. బీఆరెస్ పార్టీ ఓటమి భయంతో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి కాంగ్రెస్ ప్రచారాంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్ర చేస్తుందన్నారు.
మరోవైపు ఖమ్మం బీఆరెస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నామినేషన్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాలలో డిపెండెంట్ పేరు లేకుండా అసంపూర్తిగా నింపారని తుమ్మల ఆరోపించారు. నామినేషన్ పత్రాలపై డిపెండెంట్ ఎవరు లేనందునా రాయలేదని, దానిపై తుమ్మల ఫిర్యాదు చిల్లర రాజకీయాలంటూ అజయ్ మండిపడ్డారు.