– సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను రద్దు చేస్తాం
– కేసీఆర్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది
– కాంగ్రెస్ కు ఓటేస్తే సీఎం కేసీఆర్ కి వేసినట్టే
– ఎస్సీ వర్గీకరణ చేస్తాం
– మంచిర్యాల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను సీఎం చేయడంతో పాటు ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని శ్రీనివాస టాకీస్ నుండి ముకారాం చౌరస్తా అర్చన టెక్స్ వెంకటేశ్వర టాకీస్ వరకు సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2014, 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, సీఎం కేసీఆర్ కు అమ్ముడుపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో నేను చెప్తున్నా.. కేసీఆర్ సీఎం కాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడని అన్నారు. 2024లో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని తెలిపారు. మార్గమధ్యంలో సింగరేణి కార్మికులు తనను కలిసి, వారి హెల్మెట్ పెట్టారని అన్నారు.
సింగరేణి కార్మికులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను ఒక్క రూపాయి పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలా? వద్దా? అంటూ ప్రజలను అమిత్ షా అడిగారు. సీఎం కేసీఆర్.. ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చాడని, బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్ రద్దుచేసి.. బీసీ కమ్యూనిటీకి 4 శాతం రిజర్వేషన్ పెంచుతామని తెలిపారు.
బీజేపీ దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే, పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. రోడ్ షోలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆపార్టీ మంచిర్యాల అభ్యర్థి ఎర్రబెల్లి రఘునాథ్, నాయకులు రజనీష్ జైన్, వెంకటేశ్వరరావు, పట్టి వెంకట కృష్ణ, పానుగంటి మధు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.