Warangal | మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి.. బీఆర్ఎస్ డిమాండ్

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళు నిలిచిపోయి రైతులు తీవ్రమైన సమస్యల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదని బీఆర్ఎస్ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు, మాజీ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్ మండిపడ్డారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి :

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళు నిలిచిపోయి రైతులు తీవ్రమైన సమస్యల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదని బీఆర్ఎస్ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు, మాజీ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఎంపీలు, జిల్లాకు చెందిన మంత్రులు సురేఖ, సీతక్కలు ఏం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, రమణారెడ్డిలతో కలిసి హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప‌త్తి కొనుగోళ్లు చేయ‌లేమ‌ని జిన్నింగ్ మిల్లర్లు ముందే చెప్పినా ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు. రైతు సమస్యలను ప్రస్తావించే శక్తిలేని కేంద్రం రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రైతు సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా రైతుల సమస్యలను ప్రస్థావించింది లేదన్నారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలు నిరాకరిస్తున్న సీసీఐ వైఖ‌రిని నిర‌సిస్తున్నామన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప‌త్తి పంట పండుతోంది. ఆ రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆగం చేస్తున్నాయని విమ‌ర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడు లక్షల మంది పత్తి రైతులుండగా కొనేందుకు సీసీఐ కొర్రీలు పెడుతుంటే వారు నష్టపోవడం ఖాయమన్నారు.

ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో రైతులు కేవలం రూ. 6,000 నుండి రూ. 7,000 రూపాయలు ద‌క్కడంతో ల‌క్షల్లో న‌ష్టపోతున్నారని వివ‌రించారు. కేసీఆర్ పదేళ్ల పాల‌న‌లో రైతును రాజును చేస్తే కాంగ్రెస్ రెండేళ్ల పాల‌న‌లో ఆత్మహ‌త్యల‌కు గురి చేస్తోందని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్లలో 500 మంది ఆత్మహ‌త్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు, ఆ ప్రభుత్వ నిర్లక్ష్యమే కార‌ణమని వినయ్ విమ‌ర్శించారు.

ఎనుమాముల మార్కెట్‌కు హరీశ్ రావు

పత్తి కొనుగోళ్ళు నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శిస్తారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడుతారని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి వరంగల్ నుంచే పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఓటమి తమపై బాధ్యతను పెంచిందని, ప్రజల తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.